నగదు, మద్యం పంపిణీపై ప్రత్యేక నిఘా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎన్నికల వ్యయ నిర్వహణ నిబంధనలను అధికారులు కచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు బి.విజయ్ కుమార్ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా రిటర్నింగ్ అధికారులకు రెండో దశ బ్రీఫింగ్ సమావేశం శనివారం విజయవాడలోని ఇరిగేషన్ శాఖ సమావేశ మందిరంలో జరిగింది. ఆయన మాట్లాడుతూ ఎన్నికల వ్యయ నిర్వహణ, పర్యవేక్షణ, నిఘా బృందాల విధులు తదితర అంశాలపై అధికారులకు సమగ్రంగా దిశానిర్దేశం చేశారు. ప్రతి అభ్యర్థి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన వ్యయ పరిమితికి లోబడి ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. అభ్యర్థులకు వ్యయ పరిమితిపై ముందుగానే అవగాహన కల్పించడం, ఎన్నికల ప్రచారంలో ప్రతి ఖర్చును నిర్ణీత నమూనాలో నమోదు చేసేలా చూడాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. అభ్యర్థులు తమ రోజువారీ ఎన్నికల వ్యయ రిజిస్టర్లను నిర్ణీత సమయాల్లో అకౌంటింగ్ బృందాలకు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వ్యయ నివేదికలు సమర్పించని అభ్యర్థులకు నిబంధనల ప్రకారం తక్షణమే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. మంజూరు చేసిన అనుమతుల వివరాలను వీడియో సర్వైలెన్స్, అకౌంటింగ్ బృందాలకు అందజేసి, వాస్తవంగా జరిగిన ఖర్చులను నమోదు చేసిన వ్యయ వివరాలతో సరిపోల్చాలని సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్, వీడియో సర్వైలెన్స్ బృందాలు అప్రమత్తంగా పని చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.


