ఆలయ ఖజానాపై రూ.కోట్లలో భారం మెషినరీ ఏర్పాటుకు రూ.1.95 కోట్ల కేటాయింపు నిర్వహణ, సిబ్బంది శిక్షణకు బిల్లులే చక్రం తిప్పుతున్న చినబాబు! ట్రస్ట్ బోర్డులో కనీస చర్చ కూడా లేదాయె!
ట్రస్ట్ బోర్డు దృష్టికి రాని అంశం!
హరేకృష్ణ ఫౌండేషన్ చేతికి దుర్గమ్మ అన్నప్రసాదం!
ఏటా ఖజానాపై రూ. కోట్ల భారం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/ఇంద్రకీలాద్రి (విజయవాడపశ్చిమ): భక్తిశ్రద్ధలతో, దాతల విరాళాలతో నిరంతరాయంగా సాగుతున్న ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అన్నప్రసాదంపై ‘ప్రైవేట్’ నీడ పడనుంది. లక్షలాది మందిభక్తుల ఆకలి తీర్చే పవిత్ర అన్నదాన కార్యక్రమాన్ని హరేకృష్ణ ఫౌండే షన్‌కు అప్పగించడానికి కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ప్రభుత్వ పెద్దల నిర్ణయానికి దుర్గగుడి అధికారులు సైతం తల ఊపుతుండటం విశేషం. కేవలం భక్తులు ఇచ్చే విరాళాలతో నడుస్తున్న అన్నదానం ట్రస్ట్‌ను నిర్వీర్యం చేసేందుకు కూటమి పెద్దలు పావులు కదపడంపై ఆధ్యాత్మికవేత్తల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.
నిత్యం 6 వేల మంది భక్తులకు..
దుర్గగుడిలో నిత్యం అమ్మవారి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలోని మహామండపం ఎదుట నూతన అన్నదాన భవనంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. సాధారణ రోజుల్లో 6 వేల మందికి, వారాంతాలు, పండుగలు, పర్వ దినాల్లో 9 నుంచి 10 వేల మందికి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అన్నప్రసాదం స్వీకరించిన అనంతరం భక్తులు విరాళాలు అందజేస్తుంటారు. వీటిని బ్యాంక్‌లో అమ్మవారి అన్నదానం ట్రస్ట్ పేరిట డిపాజిట్ చేసి అందులో నుంచి వచ్చే వడ్డీతో అన్నప్రసాద వితరణ చేస్తుంటారు. ఇలా దేవస్థానం వద్ద సుమారు రూ.120 కోట్ల పైగానే డిపాజిట్లు వివిధ బ్యాంకుల్లో ఉన్నాయి. తాజాగా మెషినరీ కొనుగోలుకు బడ్జెట్ కేటాయింపులు లేవని దేవస్థానం కమిషనర్‌కు లేఖ రాయగా, కేటాయింపులు చేసేలా ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి వచ్చినట్లు సమాచారం.
మెషినరీ కొనుగోలుకు రూ. 1.95 కోట్లు
దుర్గగుడిలో అన్నదానం నిమిత్తం ఈ ఏడాది రూ. 25 కోట్లతో నూతన భవన నిర్మాణం చేపట్టారు. ఇక్కడ నూతన వంటశాలను ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. దేవస్థాన ఇంజినీరింగ్ విభాగం నూతన వంటశాలలో మెషినరీ ఏర్పాటుకు రూ.1.95 కోట్లతో అంచనాలు రూపొందించింది. ఇంతలో అన్నదానాన్ని తమ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తామంటూ హరేకృష్ణ ఫౌండేషన్ రంగ ప్రవేశం చేసింది. తొలుత ఒక్కో విస్తరికి రూ. 65 చెల్లిస్తే అన్ని తామే చూసుకుంటామని పేర్కొంది. దీనిపై ప్రభుత్వంలోని చినబాబు ద్వారా దేవదాయ శాఖలోకి ప్రవేశించడానికి పావులు కదిపింది. ఆయన ఆశీస్సులు లభించడంతో దేవదాయ శాఖ ద్వారా దేవస్థానం రూ. రెండు కోట్లు మంజూరు చేయించేందుకు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా రూ 1.95 కోట్లు మెషినరీ ఏర్పాటుకు కేటాయిస్తూ దేవదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు మెమో జారీ చేశారు.
అంతర్గత ఒప్పందాలతో..
అన్నదానం మొత్తం హరేకృష్ణకు అప్పగించకుండా దేవస్థానం సరుకులతో వంట చేసి ఇచ్చేలా అంతర్గతంగా ఒప్పందాలు చేసినట్లు తెలుస్తోంది. రోజుకు 10 వేల మందికి అన్నప్రసాదం సిద్ధంచేయడం ద్వారా ఒక్కో విస్తరికి రూ.15 చెల్లించేలా ఇరువర్గాలు అంగీకరించినట్లు సమాచారం. దేవస్థాన నిధులతో ఏర్పాటు చేసే మెషినరీని ఐదేళ్ల పాటు హరేకృష్ణ ఫౌండేషన్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మెషినరీని అమ్మిన కంపెనీనే కొన్ని నెలల పాటు దాని నిర్వహణ, సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. మెషినరీ ఏర్పాటు కు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న హరేకృష్ణ ఫౌండేషన్ నిర్వహణ, శిక్షణకు కూడా దేవస్థానం నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అమ్మవారి ఖజానాను దోపిడీ చేసేందుకు కుట్ర జరుగుతోందని భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
దుర్గగుడిలో ‘హరేకృష’్ణకు రూ. 1.95 కోట్లతో మెషినరీ ఏర్పాటు చేస్తుందనే అంశంగానీ, అన్న ప్రసాదం తయారీకి ఆ ట్రస్టుకు అప్పగిస్తున్న సంగతిగానీ తెలియదని ట్రస్ట్ బోర్డు సభ్యులు పేర్కొంటున్నారు. ఆలయ ముఖ్య అధికారితో పాటు చైర్మన్ ఇద్దరూ కలిసి ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం దేవదాయ శాఖ రూ. 2 కోట్ల మంజూరుకు ఆదేశించిన విషయం బోర్డు దృష్టికి రాలేదని కమలం పార్టీకి చెందిన సభ్యుడు పేర్కొంటున్నారు. మరో వైపున అమ్మవారి అన్నదానం ట్రస్ట్‌లో ఉన్న డిపాజిట్లను కరిగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందా అనే అనుమానాలను సైతం వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలతో దేవస్థాన ఖజానాపై రూ. కోట్ల మేర భారం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అన్నప్రసాదం తయారీకి సరుకులను దేవస్థానమే సమకూర్చి, వంట తయారు చేసి సిద్ధం చేసేందుకు కాంట్రాక్టు పద్ధతిపై వంట వారిని నియమిస్తుంది. దేవస్థానంలో మొత్తం ఐదుగురు వంట వారు నెలకు రూ. 15 వేల వేతనంపై గత 15 ఏళ్లుగా పని చేస్తున్నారు. గతంలో మూడు వేల మందికి మాత్రమే వీరు వంటను సిద్ధం చేసేవారు. ఆ తర్వాత నిత్యం ఆరు వేల మందికి అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నా ఆ ఐదుగురు వంటవారే ఉండటం గమనర్హం. ఇక సిద్ధమైన ఆహార పదార్థాలను భక్తులకు పంపిణీ చేయడంతో పాటు ఆకులు ఎత్తి, శుభ్రం చేసేందుకు ప్రత్యేకంగా టెండర్‌ను ప్రతి రెండేళ్లకు ఒక సారి పిలుస్తుంటారు. దీనికి నెలకు ఆరు నుంచి 7 లక్షల వ్యయం అవుతుంది. వాస్తవానికి అన్నప్రసాదం తయారీ, పంపిణీ చేసేందుకు ప్రతి నెలా రూ. 35 లక్షల వ్యయం అవుతుంది. హరేకృష్ణ ఫౌండేషన్‌కు అన్నప్రసాదం పంపిణీ చేస్తే సుమారు రూ. 39 లక్షలు అవుతుందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. ఈ విధంగా చూసినా దేవస్థాన ఖజానాపై ఏడాదికి రూ. 50 లక్షల మేర అదనపు భారం పడుతుంది. ఫౌండేషన్‌కు అన్నదానాన్ని అప్పగిస్తే మెషినరీ ఏర్పాటుతో పాటు దాని నిర్వహణ, అన్నప్రసాద తయారీకి ప్రతి నెలా రూ. లక్షలు చెల్లించేలా అంతర్గతంగా ఒప్పందాలు జరిగాయనే ప్రచారం జరుగుతోంది.


