వెదురుబీడెంలో నీటితొట్టెలో పడి అపస్మారకస్థితిలోకి 14 నెలల చిన్నారి సకాలంలో స్పందించి ప్రాథమిక చికిత్స అందించిన సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ సీపీఆర్‌తో స్పృహలోకి తెచ్చిన ఉద్యోగి
మైలవరం: చిట్టితల్లికి ఓ సచివాలయ ఉద్యోగి ప్రాణభిక్ష పెట్టాడు. సేకరించిన వివరాల ప్రకారం వెదురుబీడెం గ్రామానికి చెందిన వెల్లంకి రామకృష్ణ, తిరుపతమ్మ దంపతులకు 14 నెలల కుమార్తె శర్వాణి ఉంది. అతను పనులు నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తల్లి తిరుపతమ్మ ఇంట్లో పనులు చేసుకుంటున్నారు. ఆ సమయంలో శర్వాణి సమీపంలో ఉన్న నీటి తొట్టెలో పడింది. కొంత సేపటి తర్వాత తిరుపతమ్మ కుమార్తె కోసం వెతుకుతోంది.
ఉలుకు పలుకు లేకపోవడంతో..
ఆమె తొట్టెలో పడి ఉన్న శర్వాణిని గమనించి బయటికు తీసింది. ఉలుకు పలుకు లేకపోవడంతో కూతురు మరణించిందనుకుని తిరుపతమ్మ ఏడుస్తున్నారు. ఆ సమయంలో కీర్తిరాయునిగూడెం సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మోదుగు వినోద్ కుమార్ గొర్రెల ఇన్సూరెన్స్‌కు సంబంధించి వెదురుబీడెం వెళ్లాడు. సమీపంలోని తిరుపతమ్మ ఏడుపులు విని ఘటనా స్థలానికి చేరుకున్న వినోద్‌కుమార్ అపస్మారక స్థితిలో ఉన్న శర్వాణిని గమనించారు.
సీపీఆర్ చేసిన సచివాలయ ఉద్యోగి
చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని కడుపులో ఉన్న నీటిని బయటికి వచ్చేలా చేసి, నోటితో శ్వాస అందించి సీపీఆర్ చేశాడు. దీంతో చిన్నారి స్పృహలోకి వచ్చింది. వెంటనే చిన్నారిని మైలవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యానికి విజయవాడ తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. వినోద్‌కుమార్ గతంలో హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేసిన అనుభవం ఉండటంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారిని రక్షించాడు. ఆ చిట్టితల్లిని కాపాడిన వినోద్‌కుమార్‌ను పలువురు గ్రామస్తులు అభినందించారు.
ఒక్క క్షణం ఆలస్యమైనా ఆ ఇంట్లో తీరని విషాదం మిగిలేదేమో! ఆడుకుంటూ వెళ్లిన 14 నెలల చిన్నారి ప్రమాదవశాత్తూ నీటి తొట్టెలో పడి అపస్మారక స్థితికి చేరుకుంది. బిడ్డను ఆ స్థితిలో చూసిన తల్లి గుండెలవిసేలా రోదించింది. ఆ సమయంలో అటుగా వచ్చిన సచివాలయ ఉద్యోగి చూపిన సమయస్ఫూర్తి ఆ కుటుంబంలో మళ్లీ ఆశలు చిగురింపజేసింది. వైద్య అనుభవాన్ని ఉపయోగించి చిన్నారికి ప్రాథమిక చికిత్సతోపాటు సీపీఆర్ అందించి ప్రాణాలు కాపాడాడు. కన్నీటితో నిండిన ఆ తల్లి కళ్లలో మళ్లీ ఆనందం నింపాడు. మైలవరం మండలం వెదురుబీడెంలో శుక్రవారం చోటుచేసుకున్న ఘటన మానవత్వానికి నిలువుటద్దంగా నిలిచింది.


