అలా కాకుంటే
ఎన్నికల బహిష్కరణ
పోటీ లేకుంటే పనులు జరగడం లేదంటున్న ఒకటో వార్డు ప్రజలు
15 ఏళ్లుగా పంచాయతీ ఏకగ్రీవం చేస్తుంటే అభివృద్ధి ఏదీ..
వక్కపట్లవారిపాలెం ఎస్సీ కాలనీ వాసుల వినూత్న నిరసన
వక్కపట్లవారిపాలెం(నాగాయలంక): ఏకగ్రీవం వద్దు ఎన్నికలే ముద్దు అంటూ వక్కపట్లవారిపాలెం పంచాయతీ శివారు తుంగలవారిపాలెం దళితవాడ(ఒకటో వార్డు) గ్రామస్తులు నిరసన తెలుపుతూ మంగళవారం సాయంత్రం రోడ్డెక్కారు. గత మూడు పర్యాయాలుగా (15సంవత్సరాలు) ఎన్నికలు జరగకుండా గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేస్తుంటే ఏకగ్రీవ సర్పంచి, పాలకులు తమ సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని, ఫలితంగా గ్రామంలో అభివృద్ధి శూన్యమైందని ఒకటో వార్డు ఎస్సీ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. తొలుత మహిళలు ఖాళీ నీటి బిందెలతో గ్రామంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నినాదాలతో నిరసన తెలిపారు. అనంతరం కిలోమీటర్ దూరంలోని నాగాయలంక–అవనిగడ్డ మెయిన్ రోడ్డుపైకి వచ్చి ఇన్నేళ్లుగా ఏకగ్రీవం చేస్తుంటే గ్రామానికి సరైన రోడ్డు, వీధిలైట్లు, తాగునీరు, డ్రైనేజి వంటి కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటుకాలేదంటూ నిరసన ప్రకటించారు. ఈ కారణంగా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవానికి వ్యతిరేకంగా పోటీకి మద్దతు ఇస్తామని, లేదా ఎన్నికలు బహిష్కరిస్తామని కాలనీవాసులు ప్రకటించారు.
తుంగలవారిపాలెం ఎస్సీ కాలనీలో
అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన
పంచాయతీ పరిధిలోని నాగాయలంక–అవనిగడ్డ మెయిన్‌రోడ్డుపై ఖాళీ బిందెలతో గ్రామస్తుల ఆందోళన


