● 16వ కల్చరల్ ఒలంపియాడ్‌లో రజత పతకం సాధించిన సరయు ● గ్లోబల్ కౌన్సిల్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ పోటీల్లో శివతాండవం నృత్య ప్రదర్శన
నాగాయలంక: అండమాన్ నికోబార్ దీవుల్లో ఇటీవల జరిగిన గ్లోబల్ కౌన్సిల్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ పోటీల్లో సెమీ క్లాసికల్‌లో దివిసీమకు చెందిన ఐదో తరగతి విద్యార్థిని సరయు తన శివతాండవం నృత్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసి రజత పతకాన్ని ముద్దాడింది. యునెస్కో అధికారిక భాగస్వామిగా ఉన్న గ్లోబల్ కౌన్సిల్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్, అఖిల భారతీయ సాంస్కృతిక సంఘ్ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు జరిగిన 16వ కల్చరల్ ఒలంపియాడ్ ఆఫ్ పెర్ఫామింగ్ ఆర్ట్స్–2026 పోటీలలో దివిసీమ చిన్నారి మలిశెట్టి సరయు తన సత్తా చాటింది. సెమీ క్లాసికల్ సోలో డాన్స్ జూనియర్ రెఫర్టరీ విభాగంలో శివతాండవం నృత్యంతో ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. దివిసీమలోని సీనియర్ ఫొటోగ్రాఫర్, జర్నలిస్ట్ సింహాద్రి కృష్ణప్రసాద్ కుమార్తె విజేత–మలిశెట్టి వాసు దంపతుల కుమార్తె ఈ సరయు. తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా హైదరాబాద్ ప్రగతినగర్‌లో ఉంటున్నారు. అక్కడ ప్రసిద్ధిచెందిన నృత్త నాట్యాలయ డ్యాన్స్ అకాడమీ అధినేత్రి కంబాల చైతన్య శిక్షణలో 2025లో రవీంద్రభారతిలో నృత్య అరంగ్రేటం చేసింది. ఈ ఏడాది మే–జూన్ నెలల్లో పూనే(మహారాష్ట్ర)లో యునెస్కో అధికారిక భాగస్వామ్యంతో అభిల భారతీయ సాంస్కృతిక్ సంఘ్(పూనే) ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ ఆర్ట్ అండ్ టాలెంట్ సెర్చ్ మూడు సీజన్‌ల కార్నివాల్‌లో జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో విజయం పొంది అండమాన్–నికోబార్ లో జరిగిన ఈ 16వ కల్చరల్ ఒలంపియాడ్‌కు నేరుగా అర్హత సాధించింది.


