అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు

Nov 18 2026 2:19 AM | Updated on Nov 18 2026 2:19 AM

అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు ఓట్ల కోసం ప్రాణాలతో చెలగాటమా? ● ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చిన టీడీపీ నాయకుల అత్యుత్సాహం ● విద్యుత్‌ స్తంభంపై నుంచి పడి తీవ్రంగా గాయపడిన హెల్పర్‌

చిలకలపూడి(మచిలీపట్నం): అధిక ధరలకు బియ్యాన్ని విక్రయిస్తే కఠిన చర్యలుతీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల అధికారి పి.శివరామప్రసాద్‌ హెచ్చరించారు. నగరంలోని పలు బియ్యం దుకాణాలపై పౌరసరఫరాలు, విజిలెన్స్‌ శాఖల అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. డీఎస్‌వో మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో టోకు, చిల్లర వర్తక దుకాణాల్లో బియ్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్యాకింగ్‌ చేసిన బియ్యం సంచులపై ప్రభుత్వం నిర్ణయించిన ధరలను ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలన్నారు. ధరలు పెంచటం కాని, అధిక ధరలు వసూలు చేయటం, అక్రమ నిల్వలకు పాల్పడటం వంటివి జరిగితే తప్పనిసరిగా సంబంధిత వ్యాపారస్తులపై కేసులు నమోదు చేస్తామన్నారు. నగరంలో అధిక ధరలకు విక్రయిస్తున్న ఐదు దుకాణాలపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 31 కేసులు నమోదు చేసి జరిమానాలు విధించినట్లు డీఎస్‌వో తెలిపారు. చిల్లర దుకాణాలతో పాటు పెద్ద పెద్ద వ్యాపార సముదాయాల్లో కూడా బియ్యం ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయాలు జరపాలని ఆయన సూచించారు. ఈ తనిఖీల్లో డీఎస్‌వోతో పాటు విజిలెన్స్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ టి.కృష్ణ, తూనికలు, కొలతలు శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌కే రాజు, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రగతి కుమార్‌, డెప్యూటీ తహసీల్దార్‌ ఎన్‌.ప్రధాన్‌ తదితరులు పాల్గొన్నారు.

జి.కొండూరు: టీడీపీ నాయకుల అత్యుత్సాహంతో విద్యుత్‌ స్తంభంపై నుంచి పడిన హెల్పర్‌ తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఎన్టీఆర్‌ జిల్లా, జి.కొండూరు మండల పరిధిలోని దుగ్గిరాలపాడు గ్రామంలో జరిగింది. గ్రామంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం చేస్తున్న క్రమంలో వీధిలైట్లు వేయలేనోళ్లు ఓట్లు ఎలా అడుగుతారంటూ గ్రామస్తులు నిలదీశారు. దీంతో వీధి లైట్లు వేయించి ఓటర్ల దగ్గర క్రెడిట్‌ పొందాలని టీడీపీ నాయకులు భావించారు. ఈ క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించిన టీడీపీ నాయకులు విద్యుత్‌ శాఖ అధికారులకు కూడా చెప్పకుండా వీధిలైట్లు వేయించేందుకు మంగళవారం ప్రయత్నించారు. గంగినేని గ్రామంలో విద్యుత్‌ హెల్పర్‌గా పని చేస్తున్న బలుగూరి లక్ష్మణ్‌ను దుగ్గిరాలపాడు గ్రామానికి పిలిపించారు. లక్ష్మణ్‌తో గ్రామంలో వీధిలైట్లు వేయిస్తుండగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో విద్యుత్‌ షాక్‌ తగిలి లక్ష్మణ్‌ స్తంభంపై నుంచి పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మణ్‌ను స్థానికులు 108 అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి లక్ష్మణ్‌కు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement