రూ.200 ఆలస్య రుసుముతో ఈ నెల 30 వరకు దరఖాస్తుకు అవకాశం
మచిలీపట్నంఅర్బన్: ఏపీ ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ప్రవేశాల గడువును పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.200 ఆలస్య రుసుముతో ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. చదువును మధ్యలో నిలిపివేసిన వారు, వివిధ కారణాలతో పాఠశాల లేదా కళాశాల విద్యను కొనసాగించలేకపోయినవారు తమ విద్యార్హతలను పెంపొందించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీఓఎస్‌ఎస్) మరో అవకాశం కల్పించిందన్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి (ఎస్‌ఎస్‌సీ), ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు www.apopenschool.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశాలకు సంబంధించి సందేహాలుంటే ఏపీఓఎస్‌ఎస్ గుర్తింపు పొందిన ఏఐ కేంద్రాలను లేదా జిల్లా హెల్ప్‌లైన్ నంబర్ 92477 33622ను సంప్రదించాలని డీఈఓ తెలిపారు.
మచిలీపట్నంఅర్బన్: అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 23న మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పారా క్రీడా ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్‌లో క్రీడా ఎంపికల ప్రచార గోడపత్రికను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, సంక్షేమ శాఖ, జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. 13 ఏళ్లు పైబడిన దివ్యాంగ బాలబాలికలకు పారా అథ్లెటిక్స్, పారా బ్యాడ్మింటన్, వీల్‌చైర్ ఫెన్సింగ్, బ్లైండ్ గోల్‌బాల్, పారా తైక్వాండో, పారా టేబుల్ టెన్నిస్‌లో పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి గలవారు ఆధార్, వయస్సు ధ్రువీకరణ, సదరం లేదా యూడీఐడీ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. అవసరమైన క్రీడా పరికరాలను సొంతంగా తెచ్చుకోవాలన్నారు. వివరాలకు 95538 68505, 90000 13613, 94948 76657 నంబర్లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఝాన్సీలక్ష్మి పాల్గొన్నారు.


