ఘంటసాల: కార్తికమాసం సందర్భంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శైవ క్షేత్రాలకు టెంపుల్ టూరిజంలో ఘంటసాల గ్రామానికి చెందిన శ్రీజలధీశ్వర స్వామి ఆలయాన్ని గుర్తించినట్లు టూరిజం శాఖ జనరల్ మేనేజర్ టీఎస్ వీరనారాయణ తెలిపారు. ఘంటసాల గ్రామంలో ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బాలపార్వతీ సమేత శ్రీజలధీశ్వర స్వామి వారిని టూరిజం జీఏం వీరనారాయణ మంగళవారం సందర్శించి స్వామి వార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో టెంపుల్ టూరిజం పేరుతో వెబ్‌సైట్ ఏర్పాటు చేసి విజయవాడ నుంచి కృష్ణాజిల్లాలోని ముఖ్యమైన 12 శైవ క్షేత్రాలను కలుపుతూ ఒక సర్క్యూట్ ఏర్పాటు చేశామన్నారు. వీటికి కార్లు, ఇతర వాహనాలను సమకూర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా ఘంటసాల గ్రామంలోని పురాతన శైవక్షేత్రం శ్రీజలధీశ్వర స్వామి ఆలయాన్ని కలపడానికి పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు. శైవ క్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తులు, ప్రజలు www.aptc.gov.in ద్వారా సంప్రదించాలని కోరారు. ఈ టూర్ కార్తిక మాసం వరకు నిర్వహిస్తామని, భక్తులు కోరితే కొనసాగించడానికి ప్రయత్నిస్తామని టూరిజం జీఎం వీరనారాయణ తెలియజేశారు. స్థానికంగా కావాల్సిన సహకారం తాము అందిస్తామనిజెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ చెప్పారు. అనంతరం వీరనారాయణను రామకృష్ణ, షష్ఠి గుడి ధర్మకర్త గొర్రెపాటి జగన్మోహనరావు ఆలయ మర్యాదలతో సత్కరించారు. అర్చకుడు చావలి కృష్ణకిషోర్ ఆశీర్వచనాలు అందించారు.
ఏపీ టూరిజం జనరల్ మేనేజర్
టీఎస్ వీరనారాయణ


