రెండో దశ పంచాయతీ పోరుకు నోటిఫికేషన్
73 కేంద్రాల ద్వారా
కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులు ప్రతి అంశంపై పూర్తి అవగాహనతో, అప్రమత్తంగా వ్యవహరించి ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో సోమవారం ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ నిర్వహించిన సిబ్బందే ఓట్ల లెక్కింపు బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పూర్తిగా అధ్యయనం చేసి నిబంధనలపై స్పష్టమైన అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో ఎడమచేతి చిటికిన వేలికి సిరా వేయాలన్నారు. పోలింగ్ సామగ్రి పంపిణీ సమయంలో ప్రిసైడింగ్ అధికారులు తమకు అందిన ప్రతి వస్తువును పరిశీలించుకోవాలన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యేలా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపే పోలింగ్ పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ వీడియో రికార్డింగ్ ఉంటుందని నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్ వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ నమ్రతా అగర్వాల్, జెడ్పీ సీఈవో శ్రీహరి, డీపీవో ఎన్.ధనలక్ష్మి, డీఆర్డీఏ పీడీ ఎం.హరిహరనాఽథ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదటి దశలో గుడివాడ డివిజన్‌కు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు రెండో దశలో ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి సోమవారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
దీని ప్రకారం ఈ నెల 20వ తేదీ వరకు 73 నామినేషన్ల కేంద్రాల ద్వారా నామినేషన్లను స్వీకరించనున్నారు. 21వ తేదీ నామినేషన్ల పరిశీలన, 22న అభ్యంతరాలు, 23వ తేదీ నామినేషన్లలో అభ్యంతరాల పరిష్కారం, 24న నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం నిర్వహించి అనంతరం అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు.
నవంబరు 29వ తేదీన పోలింగ్, అదే రోజు మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. ఉయ్యూరు రెవెన్యూ డివిజన్‌లోని ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరు, తోట్లవల్లూరు, మొవ్వ, పమిడిముక్కల, పామర్రు, పెదపారుపూడి మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మండలాల్లో 142 గ్రామ పంచాయతీలు, 1,408 వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగుఉతాయి. ఈ ఎన్నికల నిర్వహణ 1460 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు.


