అన్నదాతల్లో అక్వాన్‌ ఆందోళన | - | Sakshi
Sakshi News home page

అన్నదాతల్లో అక్వాన్‌ ఆందోళన

Nov 17 2026 3:44 AM | Updated on Nov 17 2026 3:44 AM

18 నుంచి కృష్ణాకు భారీ వర్ష సూచన ఇప్పటికే అర్నబ్‌, మురసుతో నష్టపోయిన రైతులు

కంకిపాడు: వరుస తుపానులు అన్నదాతలను కలవరపెడుతున్నాయి. ఇప్పుడు రైతులపై అక్వాన్‌ తుపాను పిడుగులా మారనుంది. ఈ నెల 18వ తేదీ నుంచి కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు అన్నదాతలను వణికిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అక్వాన్‌ తుపానుగా మార్పు చెందింది. దీంతో సోమవారం నుంచే వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈనెల 18 నుంచి 20వ తేదీ లోపు తీవ్ర తుపానుగా మారి అత్యంత భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. నెల్లూరు–తుని మధ్య మచిలీ పట్నానికి సమీప ప్రాంతాల్లో తుపాను తీరం దాటే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు.

పంట చేతికి అందేనా?

కృష్ణాజిల్లా వ్యాప్తంగా 1.61 లక్షల హెక్టార్లలో ఈ ఏడాది వరి సాగు జరిగింది. గడిచిన వారం రోజులుగా ఉయ్యూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని పలు గ్రామాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఒక్కో ఎకరాకు రైతులు రూ.35 వేలు పైగా పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం వరి కోతలు, పంటను మార్కెట్‌కు పంపేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్వాన్‌ తుపాను విరుచుకుపడే ప్రమాదం ఉండటంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. అర్నబ్‌, మురసు తుపానుల కారణంగా జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు భారీ నష్టం వాటిల్లింది. మిగిలిన కాస్త పంట అయినా చేతికి దక్కితే చాలని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో తుపాను పొంచి ఉండటంతో అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

అపారనష్టం.. ఆదుకున్నదెవరు?

గత నెల మూడో వారంలో, ఈ నెల మొదటి వారంలో అర్నబ్‌, మురసు తుపానులు రైతులను కుదేలు చేశాయి. అర్నబ్‌తో జిల్లా వ్యాప్తంగా 34,864 హెక్టార్లలో వరి, 358 హెక్టార్లలో మినుము, 23 హెక్టార్లలో వేరుశనగ, 3 హెక్టార్లలో నువ్వులు, చెరకు 25 హెక్టార్లలో దెబ్బతింది. తర్వాత వచ్చిన మురసు తుపాను జిల్లాను తుడిచిపెట్టింది. వ్యవసాయశాఖ ప్రాథమికంగా వరి 23,648 హెక్టార్లలోనూ, మినుము 486 హెక్టార్లలో, వేరుశనగ 123 హెక్టార్లలో, 2.5 హెక్టార్లలో నువ్వులు, 208 హెక్టార్లలో పత్తి, 51 హెక్టార్లలో చెరకు, 4 హెక్టార్లలో పెసర దెబ్బతిన్నట్లు అంచనాలు వేసింది. ఉద్యానశాఖకు సంబంధించి 1,350 హెక్టార్లలో అరటి, తమలపాకు, బొప్పాయి, కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు నివేదించారు. పంట నష్టంపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు నష్టం వివరాలను వెల్లడిస్తోంది. అంతే తప్ప ఎంత మందికి, ఎంత మేరకు పంట నష్టం జరిగిందీ, పరిహారం ఎంత చెల్లిస్తారు? అన్నది నేటికీ తేల్చలేదు. దీంతో రైతులు తమను పట్టించుకునే నాధులే కరువయ్యారంటూ ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తాము రోడ్డున పడాల్సి వస్తుందని వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement