పటమట(విజయవాడతూర్పు): విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర వ్యక్తిగత పనులపై వారం రోజులు సెలవు పెట్టారు. ఈ నెల 17 నుంచి 24వ తేదీ వరకు శ్రీలకం పర్యటనకు ప్రభుత్వంకు దరఖాస్తు చేసుకున్నారు. మునిసిపల్ కార్యదర్శి సురేష్ కుమార్ బుధవారం సెలవు మంజూరు చేశారు. కమిషనర్ సెలవులో ఉన్న కాలంలో, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ (జనరల్) ఎ.రవీంద్రరావు కమిషనర్ బాధ్యతలు నిర్వహిస్తారని సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
గన్నవరం: సింగపూర్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి గాన్ సియోవ్ హువాంగ్ బుధవారం గన్నవరం విమానాశ్రయానికి విచ్చేశారు. అమరావతిలో జరగనున్న ఏపీ–సింగపూర్ జాయింట్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్ బృందంతో కలిసి ఆమె హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయంలో సింగపూర్ సహాయ మంత్రికి పలువురు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా విజయవాడ బయలు దేరివెళ్లారు.
రెడ్డిగూడెం: ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ గాయపడ్డాడు. రెడ్డిగూడెం మండలం రంగాపురం గ్రామంలోని బాలయోగి గురుకుల పాఠశాల సమీపంలో విజయవాడ – విస్సన్న పేట రహదారిపై ఈ ప్రమాదం బుధవారం జరిగింది. విస్సన్నపేట నుంచి మైలవరం వైపు వెళ్తున్న బస్సు జేసీబీని తప్పించబోయే క్రమంలో పామాయిల్ లోడుతో రెడ్డిగూడెం వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ ఆరేపల్లి నాగరాజు కాలికి తీవ్ర గాయమైంది. స్థానికులు హుటాహుటిన నాగరాజును రెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి బస్సును స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
కోడూరు: స్నేహితులతో కలిసి దైవ దర్శనానికి వెళ్లిన వ్యక్తి, స్వామి దర్శనం అనంతరం అదే ఆలయం వద్ద గుండెపోటుతో మృతిచెందారు. మండల కేంద్రమైన కోడూరు వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి యాదవరెడ్డి కుచేలరావు (42) స్నేహితులతో కలిసి మంగళవారం రాత్రి ద్వారకా తిరుమతిలోని వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. బుధవారం ఉదయం ఆలయం వద్ద తలనీలాలు సమర్పించి, స్వామిని దర్శించుకుని బయటకు వచ్చారు. అతని స్నేహితులు లడ్డూ ప్రసాదాల కోసం కౌంటర్ వద్దకు వెళ్లగా, కుచేలరావు కారులో కూర్చున్నారు. స్నేహితులు తిరిగి కారు వద్దకు వచ్చేసరికి కుచేలరావు కారు స్టీరింగ్‌పై స్పృహ కోల్పోయి అపస్మార్థక స్థితిలో కనిపించారు. హుటాహుటిన ఆలయం వద్ద ఉన్న వైద్యులకు కుచేలరావును చూపించగా, హఠాత్తుగా వచ్చిన గుండెపోటుతో మృతిచెందారని నిర్ధారించారు. స్నేహితులతో కలిసి దైవదర్శనానికి వెళ్లిన వ్యక్తి విగతజీవిలా మృతిచెంది తిరిగిరావడాన్ని కుచేలరావు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరుగా విలపించారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు యాదవరెడ్డి వెంకటసత్యనారాయణ, పార్టీ మండల కన్వీనర్ పరిశె మాధవరావు, కోట సుబ్రహ్మణ్యం, కోట పద్మావతి వరప్రసాద్, మాజీ ఎంపీటీసీలు బడే గంగాధరరావు, తిమ్మన నాంచారయ్య, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆయనకు నివాళులర్పించారు.


