పక్షవాతంకు సత్వర చికిత్స అవసరం లక్షణాలు గుర్తించిన వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి యువత స్ట్రోక్‌కు గురవుతున్న వైనం శారీరక వ్యాయామం తప్పనిసరి బీపీ, మధుమేహం, కొలస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలి అక్టోబరు 29 వరల్డ్ స్ట్రోక్ డే
లబ్బీపేట(విజయవాడతూర్పు): పక్షవాతం.. ఒకప్పుడు 50ఏళ్లు నిండిన వారు మాత్రమే దాని బారిన పడేవారు. ఇప్పుడు మూడు పదులు నిండని యువత కూడా పక్షవాతం బారిన పడుతున్నట్లు వైద్యులు చెపుతున్నారు. అందుకు స్మోకింగ్, ఆల్కాహాల్, తీవ్రమైన వత్తిళ్లు, శారీరక శ్రమ లేకపోవడమే కారణంగా చెబుతున్నారు. అయితే స్ట్రోక్ లక్షణాలను గుర్తించి సకాలంలో ఆస్పత్రికి చేరితే ప్రాణాపాయం, వైకల్యం నుంచి తప్పించవచ్చునని వైద్యులు అంటున్నారు. పక్షవాతం లక్షణాలు కనిపించిన తర్వాత ఆస్పత్రికి చేరడంతో పాటు ప్రతిక్షణం విలువైనదేనని వైద్యులు అంటున్నారు. అలా వచ్చిన వారిలో ఇస్కిమిక్ స్ట్రోక్(రక్తనాళాల్లో గడ్డలు)గా నిర్ధారించిన వారికి థ్రోంబలైజ్ ఇంజక్షన్లు ఇస్తారు. అవసరమైతే 12 గంటల్లోపు క్యాథ్‌ల్యాబ్‌కు తీసుకెళ్లి రక్తనాళాల్లోని గడ్డలను తొలగిస్తారు. ఈ రకమైన చికిత్సతో స్ట్రోక్ వచ్చినా రోగికి వైకల్యం లేకుండా చూడగలుగుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే వారిలో 85 శాతం ఇస్కిమిక్ స్ట్రోక్ కాగా, 15 శాతం హెమరైజ్డ్ స్ట్రోక్‌కు గురవుతున్నారు.


