రాజకీయాలను హుందాగా చేస్తాం మా సోదరుల జీవితం తెరిచిన పుస్తకం విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరావు
గెలిచే దమ్ము లేకనే అనైతిక చర్యలు..
నందిగామ టౌన్: రాజకీయాలను రాజకీయంగా చూస్తాం తప్ప టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శాఖమూరి వంశీధర్ మాదిరిగా మొండితోక సోదరులు దిగజారుడు రాజకీయాలు చేయరని మాజీ శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు అన్నారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం రాత్రి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేను కాదని చైర్మన్ అభ్యర్థిగా వంశీధర్ టికెట్ తెచ్చుకున్నారంటే ఎంతటి దొరలో అని తాను మాట్లాడితే ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పులిమి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. తాము రాజకీయాలను హుందాగా చేస్తామని, వ్యక్తిగత అవసరాల కోసం సామాజిక వర్గాలను అడ్డు పెట్టుకుని దిగజారుడు, నీతిమాలిన రాజకీయాలకు తాము పూర్తి వ్యతిరేకమని అన్నారు.
సామాజిక వర్గాలను అడ్డుపెట్టుకోలేదు..
మున్సిపల్ కార్యాలయంలో ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాపై ఎస్సీలను ఉసిగొల్పుతున్నారు’’ అంటూ ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడిన ఘన చరిత్ర శాఖమూరి వారిదని జగన్మోహనరావు అన్నారు. ఈ ప్రాంత విద్యార్థులకు జాతీయ స్థాయి విద్యనందించాలనే సంకల్పంతో కేంద్రియ విద్యాలయాన్ని తీసుకువస్తే అవినీతికి పాల్పడ్డామని మాట్లాడారని, కేంద్రియ విద్యాలయ భవన మరమ్మతులు చేసిన కాంట్రాక్టర్ శాఖమూరి సామాజిక వర్గానికి చెందిన వారేనని, తాము ఎంత అవినీతికి పాల్పడిందీ ఆయన్ను అడిగితే తెలుస్తుందని జగన్మోహనరావు సూచించారు.
రంగా హత్య సమయంలో స్వీట్లు పంచిన వ్యక్తి..
కాపుల ఆరాధ్య దైవం వంగవీటి మోహన రంగా హత్య సమయంలో శాఖమూరి వంశీధర్ టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారని నియోజకవర్గమంతా చెప్పుకుంటున్నారని జగన్మోహనరావు అన్నారు. అలాంటి వ్యక్తికి ఓట్లేసి గెలిపించాలా?.. కాపు సోదరులారా ఒక్కసారి ఆలోచించండి అంటూ ప్రత్యేకంగా ముద్రించిన కరపత్రం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారిందని చెప్పారు. సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న రరాధా రంగా మిత్రమండలి పేరుతో వేసిన కరపత్రాన్ని ఆయన మీడియా సమావేశంలో చూపించారు. మొండితోక సోదరుల జీవితం తెరిచిన పుస్తకమని కానీ తమతో వ్యక్తిగత విషయాలు మాట్లాడించవద్దని హితవు పలికారు.
చల్లా బ్రహ్మం పిలిస్తే పలికే వ్యక్తి..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి చల్లా బ్రహ్మేశ్వరరావు వివాదరహితునిగా, సౌమ్యునిగా మంచి పేరున్న వ్యక్తి అని జగన్మోహనరావు తెలిపారు. టీడీపీ అభ్యర్థిని గెలిపిస్తే ఆయన ఇంటి ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తుందని, అదే చల్లా బ్రహ్మేశ్వరరావును గెలిపిస్తే పిలిస్తే పలుకుతాడని చెప్పారు. జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి చల్లా బ్రహ్మేశ్వరరావును, వార్డు అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజా మద్దతు సంపూర్ణంగా ఉందని ఏ ఎన్నికలైనా దమ్ముగా, ధైర్యంగా పోటీ చేసి ప్రజా మద్దతుతో విజయం సాధిస్తామని జగన్మోహనరావు తెలిపారు. అంతేకాని ఇతర పార్టీల అభ్యర్థులను కిడ్నాప్ చేసి బలవంతంగా నామినేషన్ విత్డ్రా చేయించి అడ్డదారిలో గెలుపు దారి తొక్కటం తమకు చేతకాదన్నారు. ఒక జనరల్ మహిళ స్థానంలో ఎస్టీ మహిళపై ఓడిపోతామనే భయంతో నందిగామ చరిత్రలో లేని విధంగా అనైతిక పద్ధతులకు తెర తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను షాడో ఎమ్మెల్యేను లెక్క చేయని వారికి ప్రజలనేం లెక్క చేస్తారో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు.


