భీకర గాలులు, చిమ్మ చీకట్లతో జనాల అవస్థలు చిగురుటాకులా వణికిన కృష్ణా జిల్లా కంకిపాడు/చిలకలపూడి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అర్నబ్ తుపానుగా మారటంతో మంగళవారం రాత్రి నుంచి జిల్లా అంతటా ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. తుపాను తీరం దాటాక బలహీనపడటంతో దాని ప్రభావంతో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. అంతర్గత రహదారులు, పల్లపు ప్రదేశాల్లో భారీగా నీరు చేరటంతో కనీసం ఇళ్లల్లో నుంచి బయటకు రాలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
66.6 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం..
తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 26 మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 66.6 మిల్లీమీటర్లుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా గూడూరులో 123 మిల్లీమీటర్లు, అత్యల్పంగా బాపులపాడులో 29.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మండలాల వారీగా పరిశీలిస్తే.. పెడన 101.6 మిల్లీమీటర్లు, మొవ్వ 97, పామర్రు 90.8, మచిలీపట్నం సౌత్ 90.4, మచిలీపట్నం నార్త్ 90.4, కోడూరు 88.2, నాగాయలంక 85.2, ఘంటసాల 79.4, ఉయ్యూరు 77.2, అవనిగడ్డ 73, కృత్తివెన్ను 68.8, పమిడిముక్కల 68.4, చల్లపల్లి 67.4, తోట్లవల్లూరు 54, మోపిదేవి 49.8, బంటుమిల్లి 49.2, పెదపారుపూడి 47.2, గుడివాడ 46.6, గుడ్లవల్లేరు 45.6, పెనమలూరు 45.6, కంకిపాడు 44.8, ఉంగుటూరు 42.8, నందివాడ 42, గన్నవరం 33.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నేడు విద్యాసంస్థలకు సెలవు తుపాను సహాయ చర్యల్లో అధికారులు.. తుపాను సహాయక చర్యల్లో అధికారులు నిమగ్నమయ్యారు. కలెక్టర్ డీకే బాలాజీ నేతృత్వంలో ఆయా శాఖల సిబ్బంది విస్తృతంగా పర్యటించి తుపాను సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలోని పలు చోట్ల 177 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో 15,101 మందికి ఆశ్రయం కల్పించారు. కృత్తివెన్ను మండలం చందాల గ్రామ జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ డీకే బాలాజీ, జేసీ ఎం.నవీన్ సందర్శించారు. వసతి పొందుతున్న వారితో ప్రత్యేకంగా మాట్లాడి వసతులపై ఆరా తీశారు. మరో వైపు జిల్లా వ్యాప్తంగా పంట నష్టంపై ప్రాథమిక అంచనాలను రూపొందించేందుకు వ్యవసాయశాఖ, ఉద్యానశాఖల అధికారులు సిబ్బందితో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రాథమిక అంచనాలను సిద్ధం చేస్తున్నారు.
‘వరి’ంచే సమయంలో విపత్తు..
ప్రధానంగా వరి పంటకు సంబంధించి కోతకు సిద్ధమవుతున్న, చిరుపొట్ట, కంకులు దశలో ఉన్న వరి చేలు నేలవాలాయి. వర్షానికి కంకులు సుంకు రాలిపోతుందని, చిరుపొట్ట దశలో ఉన్న వరి పొలాలకు నష్టం అపారంగా ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటపై పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి అందే పరిస్థితి ఉండదని ఆందోళన చెందుతున్నారు. దీంతో పాటుగా దివిసీమ పరిధిలో వరి నారుమడులు నీట మునగటంతో రైతులు పొలాల్లో నిలిచిన నీటిని డ్రెయిన్లు, పంట బోదెల్లోకి మళ్లించేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు.
భీకర గాలులు, చిమ్మ చీకట్లతో జనాల అవస్థలు
చిలకలపూడి(మలచిలీపట్నం): జిల్లాలో అర్నబ్ తుపాను పరిస్థితుల కారణంగా గురువారం జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, కళాశాలలకు కలెక్టర్ డీకే బాలాజీ సెలవు ప్రకటించారు. తుపాను ప్రభావం దృష్ట్యా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సెలవు ప్రకటించామని తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు ఈ ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు.
జిల్లా వ్యాప్తంగా
విస్తారంగా వర్షాలు
నేలవాలిన వరిపైర్లు
దెబ్బతిన్న ఉద్యాన పంటలు
ధ్వంసమైన విద్యుత్ స్తంభాలు
విద్యుత్ సరఫరా
అంతరాయంతో ప్రజల అవస్థలు