గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ మేయర్, చైర్మన్ అభ్యర్థులు బుధవారం జోరువానలో సైతం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనను గుర్తు చేసుకుని ఈ ఎన్నికల్లో తమ పార్టీకి పట్టం కట్టాలని అభ్యర్థించారు.
విజయవాడ కార్పొరేషన్లో..
విజయవాడ కార్పొరేషన్ వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంలో కాళేశ్వరరావు మార్కెట్ ప్రాంగణంలోని వస్త్రలత హోల్సేల్ మార్కెట్లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, 31వ డివిజన్ అభ్యర్థి మండెపూడి చటర్జీతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. పలు దుకాణాలను సందర్శించి స్థానిక వ్యాపారులతో ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యలను, క్షేత్రస్థాయి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను బలపరచాలని వ్యాపారులను కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కాకుండా ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ నడుస్తోందన్నారు.
తిరువూరులో..
తిరువూరు మునిసిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి పరసా శ్రీనివాసరావు, కౌన్సిలర్ అభ్యర్థి పాలెం రమాదేవితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటర్లకు కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు.
నందిగామ నియోజకవర్గంలో..
నియోజకవర్గంలో వర్షంలోనూ అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 7, 27, 24 వార్డుల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఆవుల మల్లీశ్వరి, పట్టా శ్రీను, చలమల శ్రీను ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. అలాగే నందిగామ రూరల్ మండలంలోని కేతవీరునిపాడులో జెడ్పీటీసీ అభ్యర్థి ఉప్పెల్లి సుధారాణి, ఎంపీటీసీ అభ్యర్థి నెలకుదిటి శివనాగేశ్వరరావు ప్రచారంలో పాల్గొన్నారు. వీరులపాడు మండలంలోని బోడవాడ, జమ్మవరం గ్రామాల్లో జెడ్పీటీసీ అభ్యర్థి ఇప్పల కృష్ణారెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి కట్టా వెంకటేశ్వర్లు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
మైలవరం నియోజకవర్గంలో..
వైఎస్సార్ సీపీ కొండపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి నల్లమోతు తేజస్వి, 13, 14వ వార్డుల అభ్యర్థులు కోట లిల్లీదేవి, కాటమరాజు దుర్గాభవానిల విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం రాత్రి మాజీ మంత్రి జోగి రమేష్ ప్రచారం నిర్వహించారు. అలాగే జి.కొండూరు మండలంలోని పినపాక గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి చెన్నూరు సుబ్బారావుతో కలిసి జెడ్పీటీసీ అభ్యర్థి వేములకొండ లక్ష్మీతిరుపతమ్మ, మైలవరంలోని 6వ వార్డులో అభ్యర్థి తొమ్మండ్రు రాంబాబు ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు.
జగ్గయ్యపేట పరిధిలో..
పెనుగంచిప్రోలు రెండో సెగ్మెంట్లో బుధవారం ఎంపీపీ అభ్యర్థి దేరంగుల మహాలక్ష్మి, 4వ సెగ్మెంట్ అభ్యర్థి రేణుక తరఫున వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జగ్గయ్యపేట మండలంలోని అన్నవరం, ముక్త్యాల, చిల్లకల్లు–3, వేదాద్రి, బండిపాలెం, షేర్మహ్మద్పేట–1, తక్కెళ్లపాడు గ్రామాల్లో అభ్యర్థులు రేగండ్ల పద్మ, గొర్రెపాటి కుమారి, మర్రి మణికంటేశ్వరరావు, దర్శి నరసింహారావు, మైలా రామకృష్ణ, పల్లెబోయిన రేణుకలు ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలంటూ అభ్యర్థించారు. పేట పట్టణంలోని ఆయా వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఉత్సాహంగా ఇంటింటి ప్రచారం సాగించారు.
కొండపల్లి 14వ వార్డులో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న
మాజీ మంత్రి జోగి రమేష్, చిత్రంలో అభ్యర్థులు లిల్లీదేవి, భవానీ
నందిగామ 27వ వార్డులో ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్న
వైఎస్సార్ సీపీ అభ్యర్థి పట్టా శ్రీను


