రోడ్డెక్కిన పొత్తులు..! | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన పొత్తులు..!

Oct 18 2026 2:06 AM | Updated on Oct 18 2026 2:06 AM

అంతకు మించి సీట్లు ఇవ్వను

ఏం చేస్తావో చేసుకో !

కేశినేని చిన్ని వర్సెస్‌ బొండా ఉమా

జనసేనకు ఇచ్చిన సీట్లలోనూ పోటీ చేయాలని అనుచరులకు ఆదేశాలు

తిరువూరులోనూ పోటీకి సిద్ధం

నామినేషన్లకు రావాలంటూ

కొలికపూడి ఆహ్వానం

జగ్గయ్యపేటలో రెబల్‌ నామినేషన్‌

సాక్షి ప్రతినిధి, విజయవాడ: కూటమిలో పొత్తులు రోడ్డెక్కాయి. విజయవాడ నగరంలో కూటమి మధ్య చర్చలు ఇంకా ఫలితాన్ని ఇవ్వలేదు. శనివారం ఉదయం జరిగిన చర్చల్లో కూడా పీటముడి వీడలేదు. జనసేన మొత్తం 27 సీట్లు అడిగితే 18 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉండటంతో మరో తొమ్మిది సీట్లలో స్నేహపూర్వక పోటీలకు సిద్ధం కావాలని అధిష్టానం చెబుతోందని జనసైనికులు చెబుతున్నారు. బీజేపీ 14 సీట్లు అడిగితే ఇప్పటివరకూ ఎన్ని సీట్లు ఇవ్వాలన్నది నిర్ణయించలేదు. దీంతో ఆదివారం 20 డివిజన్లలో నామినేషన్లు వేయాలని, అవసరమైతే విజయవాడ వరకూ స్నేహపూర్వక పోటీలకు సిద్ధమతున్నట్లు బీజేపీ నాయకులు చెబుతున్నారు.

విజయవాడ తూర్పులో మాత్రమే కూటమి అనుకున్న సీట్లు దక్కాయి. జనసేనకు ఏడు సీట్లు, రెండు సీట్లు బీజేపీకి ఇవ్వడానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అంగీకరించారు. విజయవాడ పశ్చిమ విషయానికి వస్తే బీజేపీ ఎమ్మెల్యే సుజనాచౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో బీజేపీకి కనీసం ఆరు సీట్లు కావాలని పట్టుపడుతున్నారు. జనసేన ఎనిమిది సీట్లు అడుగుతోంది. ఇన్ని సీట్లు ఇవ్వడానికి పశ్చిమ నేతలు ససేమిరా అంటున్నారు. చివరికి జనసేనకు ఆరు, బీజేపీకి ఐదు సీట్లు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే బొండా మధ్య వాగ్వాదం

విజయవాడ సెంట్రల్‌లో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సీట్ల కేటాయింపు విషయంలో వెనక్కి తగ్గడం లేదు. శనివారం ఉదయం జరిగిన రెండోదఫా మీటింగ్‌లో కూడా నాలుగు కన్నా ఎక్కువ ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. ఈ విషయంలో ఎంపీ కేశినేని చిన్నికి, బొండాకు మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అంతకు మించి సీట్లు ఇవ్వను ఏం చేస్తావో చేసుకోమని ఎంపీని ఉద్దేశించి బొండా వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.

స్వతంత్రులుగా నామినేషన్ల్లు వేయాలని..

మరోవైపు జనసేనకు కేటాయించిన సీట్లలో స్వతంత్రులుగా నామినేషన్లు వేయండని తన అనుచరులకు బొండా చెప్పారని తెలిసింది. అయితే సాయంత్రానికి మెత్తబడి మరో సీటు ఇవ్వడానికి అంగీకారం తెలిపినట్లు సమాచారం. బీజేపీకి రెండు సీట్లు కేటాయిస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు టీడీపీ తరఫున 15వ డివిజన్‌ నుంచి కొమ్మారెడ్డి పట్టాభి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే 69వ డివిజన్‌ నుంచి ఇద్దరు టీడీపీ నుంచి, ముగ్గురు జనసేన నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యుదయ వాదుల సంఘం తరఫున మాజీ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆదివారం నామినేషన్‌ వేయనున్నారు. తనకు మద్దతు ఇవ్వాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు ఆయన లేఖ రాశారు.

జనసేన అధిష్టానానికి ఫిర్యాదు

తిరువూరు మున్సిపాలిటీని జనసేనకు కేటాయించారు. అక్కడ అభ్యర్థిగా పి.మాధవిని పార్టీ ప్రకటించింది. అయితే టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. పెనుమల్లి శ్రావణికి తాను మద్దతు ఇస్తున్నానని, ఆదివారం ఆమె నామినేషన్‌ దాఖలు చేసే కార్యక్రమానికి కేడర్‌ తరలిరావాలంటూ వాట్సప్‌ స్టేటస్‌ ద్వారా పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వైఖరితో ఖంగుతిన్న జనసైనికులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వార్డుల్లో సైతం టీడీపీ, జనసేన అభ్యర్థులతోపాటు ఎమ్మెల్యే వర్గీయులు నామినేషన్లు దాఖలు చేశారు. జగ్గయ్యపేటలో టీడీపీ తరపున రెబల్‌ అభ్యర్థి ఆచంట సునీత నామినేషన్‌ దాఖలు చేశారు.

ఎమ్మెల్యే ఉమా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement