మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ (శాప్) ఆధ్వర్యంలో ఖేలో ఇండియా పథకం కింద కాకినాడ జిల్లా క్రీడా ప్రాథికార సంస్థలో వెయిట్‌లిఫ్టింగ్ కోచ్ భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్థి అధికారి (డీఎస్‌డీఓ) కె.కోటేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు స్పోర్ట్స్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని, అర్హతలు, ఆసక్తి ఉన్న వారు అదే వెబ్‌సైట్‌లో ఈ నెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు.
ఈ నెల 24న ఆలిండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్స్ జిల్లా స్థాయి ఎంపికలు
ఏపీ సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్‌లో ఎన్టీఆర్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు జిల్లా స్థాయి జట్టులో క్రీడాకారుల ఎంపికను ఈ నెల 24వ తేదీ ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్థి అధికారి (డీఎస్‌డీవో )కె.కోటేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు (పురుషులు, మహిళలు) పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీ శనివారం మాచవరంలోని ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, క్యారమ్స్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, లాన్ టెన్నిస్, పవర్‌లిఫ్టింగ్, షటిల్ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, యోగా పోటీలు నిర్వహిస్తామని, శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలోని స్పార్క్ అకాడమీలో చెస్‌లో ఎంపికలు జరుగుతాయని తెలియజేశారు. వివరాలకు 98661 34016 నంబరులో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): రైలు నుంచి జారిపోయిన రూ. 7 లక్షలు నగదు ఉన్న బ్యాగును జీఆర్‌పీ పోలీసులు గుర్తించి బాధితుడికి అప్పగించారు. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రిటైర్డ్ ఉపాధ్యాయుడు పమిడిముక్కల శ్రీకృష్ణ గౌతమ్ కుటుంబ సభ్యులతో ఖమ్మంజిల్లా బురాన్‌పురం గ్రామంలో నివసిస్తున్నాడు. ఈ నెల 17న తన పీఎఫ్ ఖాతా నుంచి రూ. 7 లక్షలను విత్‌డ్రా చేసుకుని గుంటూరులో బంగారం కొనుగోలు చేసేందుకు కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11019) రైలులో బయలుదేరాడు. రైలు విజయవాడ స్టేషన్ చేరుకునే ముందు అవుటర్‌లో నెమ్మదిగా వెళ్తుండగా రైలు కుదుపులకు అతని చేతిలోని నగదు ఉన్న బ్యాగు జారి కిందపడి పోయింది. అనంతరం రైలు విజయవాడ చేరుకోగానే జీఆర్‌పీ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ పి.కనకారావుకు ఫిర్యాదు చేయడంతో ఆయన వెంటనే స్పందించి క్రైం టీమ్, ఆర్‌పీఎఫ్ సిబ్బంది, ఆర్‌పీఎఫ్ సీఐబీ సిబ్బందితో కలసి ఘటన స్థలానికి చేరుకునేందుకు అవసరమైన ఆధారాలు, క్లూస్‌లు సేకరించారు. అనంతరం పది కిలోమీటర్ల దూరంలోని ఘటనా స్థలం పరిసరాల్లో యాభై సీసీ టీవీ పుటేజీలను పరిశీలించి బ్యాగును తీసుకెళ్లిన వ్యక్తిని గుర్తించారు.
నగదు బ్యాగు స్వాధీనం
రైలు నుంచి బ్యాగు జారిపడిపోవడాన్ని గుర్తించిన పాత ఆర్‌ఆర్‌పేటలో నివసిస్తున్న లక్కు చినకాసయ్య అనే వ్యక్తి బ్యాగును తీసుకుని వెళ్లిపోయాడు. సాంకేతిక పరిజ్ఞానంతో అతన్ని గుర్తించిన పోలీసులు ఇంటికి వెళ్లి అతని బ్యాగులోని రూ. 7లక్షల నగదుతో పాటు రెండు గ్రాముల బంగారంతో పూతపూసిన చేతి గడియారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ కనకారావు బాధితుడిని పిలిపించి అతనికి నగదు, చేతి గడియారాన్ని అప్పగించాడు. కేసులో వేగంగా స్పందించి సాంకేతిక ఆధారాలతో నగదును గుర్తించి బాధితునికి అప్పగించడంపై రైల్వే డీఎస్‌పీ జయసూర్య సిబ్బందిని అభినందించారు.


