వరంగల్ : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ సంబురాలు జిల్లాలో అంబరాన్నంటాయి.
వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండలకేంద్రాలు, గ్రామాల్లో తొమ్మిది రోజుల పాటు సాగిన బతుకమ్మ వేడుకలు ఆదివారం సాయంత్రం వైభవంగా ముగిశాయి.
తంగేడు, గునుగు, చామంతి, బంతి తదితర పూలతో మహిళలు బతుకమ్మలను అందంగా పేర్చారు. గ్రామాలు, పట్టణాల్లోని దేవాలయాలు, బతుకమ్మ ఆట స్థలాల్లో అధికారులు మౌలిక వసతులు కల్పించారు.
సాయంత్రం తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ యువతులు, మహిళలు ఆడిపాడారు.
మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. గౌరమ్మకు తీరొక్క నైవేద్యాలు సమర్పించారు. అనంతరం పోయిరా బతుకమ్మ.. పోయిరావమ్మా.. అంటూ చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు.


