వైఎస్సార్‌ సీపీలోకి టీడీపీ కుటుంబాలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలోకి టీడీపీ కుటుంబాలు

Oct 19 2026 7:24 AM | Updated on Oct 19 2026 7:24 AM

వైఎస్సార్‌ సీపీలోకి టీడీపీ కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరిక 28న స్థానిక సెలవు నేడు పోలీసు మీ కోసం రద్దు అనారోగ్య సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య

గన్నవరం రూరల్‌: మండలంలోని సూరంపల్లిలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలు కుటుంబాలు ఆదివారం గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ వల్లభనేని వంశీమోహన్‌ సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి షాక్‌ ఇచ్చినట్లు అయ్యింది. సూరంపల్లి శివారు రామచంద్రాపురం గ్రామానికి చెందిన వారు వైఎస్సార్‌ సీపీలో చేరగా వంశీ వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. పెదపూడి సుధాకర్‌, రమేష్‌, శోభనాద్రి, రాజా రవీంద్ర, కిషోర్‌ కుటుంబాలు పార్టీలో చేరాయి. వైఎస్సార్‌ సీపీ నాయకులు సర్నాల రాంబాబు, కూరాకుల కోటేశ్వరరావు, సర్నాల లక్ష్మణరావు, కాజా వెంకట సుబ్బారావు, భూక్యా కోటేశ్వరరావు, కై లే శివకుమార్‌, పోలిమెట్ల జయరాజు, నీలం ప్రవీణ్‌కుమార్‌, మండల పార్టీ అధ్యక్షుడు పడమట సురేష్‌, పసుపులేటి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

మచిలీపట్నంటౌన్‌: మచిలీపట్నం నగరానికి చెందిన 15 మంది టీడీపీ కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. టీఎన్‌టీయూసీ మచిలీపట్నం నగర ఉపాధ్యక్షుడు గొల్లు సతీష్‌ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీ నియోజవర్గ సమన్వయకర్త పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) సమక్షంలో చేరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ షేక్‌ సలార్‌ దాదా, పార్టీ జిల్లా కోశాధికారి బందెల థామస్‌ నోబుల్‌, పార్టీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న, మాజీ డెప్యూటీ మేయర్‌ లంకా సూరిబాబు, మాజీ కౌన్సిలర్‌ చిటికెన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

చిలకలపూడి(మచిలీ పట్నం): జిల్లాలో మచిలీపట్నం కార్పొరేషన్‌, పెడన, ఉయ్యూరు మున్సిపాలిటీలకు ఈ నెల 28వ తేదీ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ జరగనుండటంతో సెలవు ప్రకటించినట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వుల ప్రకారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్‌ వివరించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా సెలవు కల్పించాలని పేర్కొన్నారు. పోలింగ్‌ కేంద్రాలుగా వినియోగించే ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలు, ఇతర భవనాలకు పోలింగ్‌కు ముందు రోజు, పోలింగ్‌ రోజు, ఓట్ల లెక్కింపు రోజు స్థానిక సెలవు వర్తిస్తుందని తెలిపారు.

కోనేరుసెంటర్‌: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసంను ఈ నెల 19వ తేదీ సోమవారం రద్దు చేస్తున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యంలో అమలులో ఉన్న ఎన్నికల కోడ్‌ను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసిన అనంతరం మీకోసం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

గన్నవరం: ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై గన్నవరం పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక గౌడపేటకు చెందిన నాగ శ్రీనివాసరావు(55) వ్యవసాయ కూలీ పనులు చేస్తుంటాడు. ఐదేళ్ల క్రితం పక్షవాతం రావడంతో పాటు మైగ్రేన్‌ వంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. తీవ్రమైన తలనొప్పి భరించలేక ఐదు రోజుల క్రితం ఎలుకల మందు తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతన్ని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం శ్రీనివాసరావు కోలుకుని రెండు రోజుల క్రితం తిరిగి ఇంటికి వచ్చాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఇంటి వరండాలో వైర్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి అతన్ని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు వంశీకృష్ణ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement