వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థిగా రాయన భాగ్యలక్ష్మి నామినేషన్ దాఖలు అభివృద్ధి బాటలో.. విజయమే లక్ష్యంగా.. ర్యాలీకి అనుమతి నిరాకరించడంతో నేరుగా వీఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు నామినేషన్లో అవినాష్, వెలంపల్లి, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థిగా రాయన భాగ్యలక్ష్మి ఆత్మవిశ్వాసంతో నామినేషన్ వేశారు. పార్టీ జిల్లా నేతలు తరలిరాగా అభివృద్ధి బాటలో విజయమే లక్ష్యంగా.. నామినేషన్‌తో ఎన్నికల సమరానికి శ్రీకారం చుట్టారు. తొలుత లంబాడీపేటలోని తన ఇంటి నుంచి ముఖ్యనేతలు వెంటరాగా చిట్టినగర్ శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం (కొత్త అమ్మవారిగుడి)కు చేరుకొని అక్కడ పూజలు చేశారు. అక్కడి నుంచి కెనాల్‌రోడ్డు వినాయకుని ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా నగరపాలకసంస్థ ప్రధాన కార్యాలయంలోని ఎలక్షన్ సెల్‌కు చేరుకున్నారు. రాయన భాగ్యలక్ష్మికి పార్టీ అధికారిక ’బి–ఫారం’ను వైఎస్సార్ సీపీ పశ్చిమ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు అందజేశారు.
ర్యాలీకి అనుమతించని పోలీసులు
తొలుత నామినేషన్ కార్యక్రమాన్ని భారీ ర్యాలీతో నిర్వహించాలని వైఎస్సార్ సీపీ భావించింది. పోలీసులు 50 మంది మించకుండా నామినేషన్ దాఖలు చేయాలని, ర్యాలీకి అనుమతి నిరాకరించారు. దాంతో కొద్దిమంది నేతలతోనే ఆమె నామినేషన్ వేశారు. అయితే కూటమి అభ్యర్థి నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీ నిర్వహించారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు వత్తాసు పలికి ర్యాలీకి అనుమతించారని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపించారు. కార్యక్రమంలో ప్రాంతీయ పరిశీలకులు అయోధ్యరామిరెడ్డి రాయన భాగ్యలక్ష్మికి ఆశీస్సులందించారు. జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పోతిన మహేష్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ హయాంలో చేసిన అభివృద్ధి గెలిపిస్తుంది: మేయర్ అభ్యర్థి భాగ్యలక్ష్మి
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో మేయర్‌గా విజయవాడలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని భాగ్యలక్ష్మి ధీమా వ్యక్తం చేశారు. ఆ అభివృద్ధి కార్యక్రమాలను చూసి తనకు ఓటు వేయాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. నగరంలో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పార్కులు, ఆసుపత్రులు ఇలా అన్ని విధాలుగా వందలాది కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. నగరపాలక సంస్థకు తాను మేయర్‌గా కరోనా రెండేళ్లు మినహాయిస్తే మిగిలిన మూడు సంవత్సరాలు జాతీయ స్థాయిలో ఉత్తమంగా నిలిపానన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలను అందుకున్నామని వివరించారు. ప్రతి రోజూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. జగన్మోహన్రెడ్డి తనపై విశ్వాసంతో రెండో సారి అవకాశం కల్పించారని, ఆ నమ్మకాన్ని నిలబెడతానన్నారు.
మేయర్ పీఠాన్ని కై వసం చేసుకుంటాం: దేవినేని అవినాష్
విజయవాడ మేయర్ పీఠాన్ని వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలా నగరాల్లో మేయర్లు, చైర్మన్లు కూటమి ప్రలోభాలకు లొంగారని గుర్తు చేశారు. కానీ మేయర్‌గా ఐదేళ్ల పాటు విజయవంతంగా పని చేసిన రాయన భాగ్యలక్ష్మి కూటమి పాలకులు అనేక ప్రలోభాలు పెట్టినా వాటిని వ్యతిరేకించారన్నారు. జగన్మోహన్రెడ్డిపై నమ్మకంతో ఆమె పూర్తి కాలం నగరాన్ని విజయపథంలో నడిపించారని వివరించారు.
పోలీసులు పక్షపాత వైఖరి వీడాలి : వెలంపల్లి
పోలీసులు పక్షపాత వైఖరి వీడాలని మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. తమ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి ర్యాలీకి అనుమతి ఇవ్వని పోలీసు అధికారులు కూటమి అభ్యర్థికి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. బైక్‌లపై హడావుడి చేస్తూ పెద్ద సంఖ్యలో వచ్చిన కూటమి నేతలపై కేసు నమోదు చేస్తారా..?, అంత దమ్ము ఉందా..? అంటూ పోలీసులను ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డి పాలనలో నగరాభివృద్ధికి తమ పార్టీ కృషి చేసిందని గుర్తు చేశారు.
కూటమికి ఓటు అడిగే అర్హత లేదు:
మల్లాది విష్ణు
కూటమి ప్రభుత్వానికి ప్రజలను ఓటు అడిగే అర్హత లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన ఏ హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సామాన్యులు అల్లాడుతున్నారన్నారు. ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు వైఎస్సార్ సీపీకి మాత్రమే ఉందన్నారు.


