ఎన్నికల నిర్వహణలో సహకరించండి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిర్వహణలో సహకరించండి

Oct 18 2026 2:06 AM | Updated on Oct 18 2026 2:06 AM

రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ బాలాజీ

చిలకలపూడి(మచిలీపట్నం): స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బాలాజీ కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల నేతలతో జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌ తో కలిసి ఆయన చాంబర్‌లో శనివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణ అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, వాటికి సంబంధించి అభ్యర్థులకు రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎలాంటి సందేహాలు, సమస్యలు ఉన్నా రిటర్నింగ్‌ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. నామినేషన్ల సమయంలో అఫిడవిట్లు అసంపూర్తిగా సమర్పించటం, రిజర్వేషన్‌ స్థానాలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జత చేయకపోవటం తదితర లోపాలతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా నిబంధనను ముందుగానే అవగాహన కల్పిస్తామన్నారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంలో జాప్యం జరుగుతోందని అలా కాకుండా నామినేషన్ల ప్రక్రియ సమయం తక్కువ ఉండటంతో వీలైనంత త్వరగా పత్రాలు జారీ చేసేలా చూడాలని కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. అభ్యర్థులకు క్రిమినల్‌ కేసులు జిల్లాలోని వివిధ స్టేషన్లలో ఉండే అవకాశాలు ఉన్నాయని అందుకోసం సింగిల్‌ డెస్క్‌ను ఏర్పాటు చేసి అభ్యర్థులకు వెసులుబాటు కల్పించాలని కోరారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ అన్ని పార్టీలపై ఒకే రకంగా అధికారులు వ్యవహరించాలని, వివక్ష చూపవద్దని కోరారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పిస్తామని, నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు యంత్రాంగం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్వో కె.శ్రీధర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో ఎం.శ్రీహరి, వైఎస్సార్‌ సీపీ నేత దుక్కిపాటి శశిభూషణ్‌, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ షేక్‌ సలార్‌దాదా, మట్టా జాన్‌ విక్టర్‌బాబు, సీపీఎం నేత కొడాలి శర్మ, మాజీ డెప్యూటీ మేయర్‌ లంకా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement