నేడు దుర్గాదేవి అలంకారంలో..
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజు శనివారం అమ్మవారు శ్రీమహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. శనివారం వీకెండ్ కావడంతో మెట్రోనగరాల నుంచి ఐటీ రంగ నిపుణులు, యువతీ యువకులు అమ్మవారిని దర్శించు కున్నారు.
టీటీడీ, పెనుగంచిప్రోలు, కనకమహాలక్ష్మి ఆలయాల నుంచి సారె
దసరా ఉత్సవాల్లో భాగంగా టీటీడీ నుంచి అమ్మవారికి సారెను సమర్పించారు. టీటీడీ ఆలయ ధర్మకర్తలు జాస్తి సాంబశివరావు, నన్నపనేని సదాశివరావు, ఆలయ సూపరింటెండెంట్ సూర్యనారాయణ, అర్చకులు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. వారికి దుర్గగుడి సిబ్బంది స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలను సమర్పించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. కనకమహాలక్ష్మి ఆలయాల నుంచి చైర్మన్ కందుల నాగరాజు, ఈవో కె. శోభారాణి, పాలక మండలి సభ్యులు, అర్చకులు అమ్మవారికి సారెను సమర్పించారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయం నుంచి పట్టువస్త్రాలను సమర్పించారు.
తెల్లవారుజాము నుంచే రద్దీ..
తెల్లవారుజాము నుంచే మహాలక్ష్మి దర్శనానికి పెద్ద సంఖ్యలో క్యూలో బారులు తీరి కనిపించారు. ఉదయానికి రథం సెంటర్, ఇటు హెడ్ వాటర్ వర్‌ుక్స వరకు భక్తులు క్యూలో వేచి ఉండటం కనిపించింది. మరో వైపున క్యూలో కాకుండా సిఫారసులు, వివిధ ప్రభుత్వ శాఖల పేరిట సిబ్బంది ఇష్టానుసారం తమ బంధువులు, కుటుంబ సభ్యులకు దర్శనాలు చేయించడం కనిపించింది. దీంతో వీఐపీలకు దర్శనానికి అర్ధగంట, సామాన్యులకు ఐదుగంటలు పట్టింది. ఆలయ ప్రాంగణంలో నిన్నటి వరకు కనిపించిన దేవదాయ శాఖ అధికారులు, పోలీసు ఉన్నతాధికారుల హడావుడి కనిపించలేదు.
దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖులు
దుర్గమ్మను మధ్యప్రదేశ్ సీఎం మోహన్‌యాదవ్, సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు, అల్లరి నరేష్, సుబ్బరాజు దర్శించుకున్నారు.
7వ రోజు ఆదాయం రూ. 26.01 లక్షలు
దసరా ఉత్సవాలను పురస్కరించుకుని 7వ రోజు దేవస్థానానికి రూ. 26.01 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. 6 లడ్డూ ప్రత్యేక ప్యాక్ విక్రయం ద్వారా రూ. 23లక్షలు, సింగిల్ లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ. 88,500, మూడు లడ్డూ ప్రత్యేక ప్యాక్ ద్వారా రూ. 1.50 లక్షలు, కేశఖండన టికెట్ల విక్రయం ద్వారా రూ. 56,400 ఆదాయం లభించింది.
దుర్గామల్లేశ్వరస్వామి వార్ల నగరోత్సవ సేవ శనివారం సాయంత్రం కనుల పండువగా జరిగింది.
శరన్నవరాత్రుల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం అష్టమి తిథిన దుర్గమ్మ వారు శ్రీదుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. శరన్నవరాత్రుల్లో దుర్గాదేవిని అర్చిస్తే దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుంది. సమస్త దేవతా స్వరూపిణి, విశ్వపూజిత అయిన శ్రీదుర్గమ్మ వారు దర్శనం సకల శ్రేయోదాయకం.


