నామినేషన్ల జోరు | - | Sakshi
Sakshi News home page

నామినేషన్ల జోరు

Oct 18 2026 2:06 AM | Updated on Oct 18 2026 2:06 AM

రెండో రోజు 210 నామినేషన్లు

కృష్ణా అన్ని పార్టీల్లో ఖరారైన మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్లు

కూటమిలో ఫైనల్‌ కాని కార్పొరేటర్‌, కౌన్సిలర్‌ స్థానాలు

మచిలీపట్నం కూటమిలో అంతర్గత పోరు

వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్థి లంకా జ్యోతి తరఫున ఒక నామినేషన్‌ దాఖలు

సాక్షి, విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో రాజకీయ వేడి పెరిగింది. శనివారం నామినేషన్ల జోరు ఊపందుకుంది. మేయర్‌, చైర్మన్‌ అభ్యర్థుల ఎంపిక పూర్తయినా, కూటమి పార్టీల మధ్య కార్పొరేటర్‌, కౌన్సిలర్‌ స్థానాల పంపకం ఇంకా కొలిక్కిరాలేదు.

వైఎస్సార్‌ సీపీ దూకుడు..

వైఎస్సార్‌ సీపీ తరఫున మచిలీపట్నం కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థి లంకా జ్యోతిని ప్రతిపాదిస్తూ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పేర్ని కృష్ణమూర్తి(కిట్టు) ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నెల 18వ తేదీ ఆదివారం లంకా జ్యోతి మేయర్‌ అభ్యర్థిగా మూడు సెట్ల నామినేషన్‌ పత్రాలను ఆర్వోకు అందజేయనున్నారు. స్థానిక మూడు స్తంభాల సెంటర్లోని వినాయకస్వామి ఆలయం వద్ద నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి మున్సిపల్‌ కార్యాలయానికి చేరి నామినేషన్‌ పత్రాలను ఆమె ఆర్వోకు అందజేయనున్నారు. శనివారం పెడన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా కటకం నాగకుమారి, ఉయ్యూరు మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా పైడిముక్కల దివ్య నామినేషన్లు దాఖలు చేశారు. పెడన కౌన్సిలర్‌ స్థానాలకు వైఎస్సార్‌ సీపీ నుంచి 18 సెట్ల నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఉయ్యూరు మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా వైఎస్సార్‌ సీపీ తరఫున పైడిముక్కల దివ్య ఒకసెట్‌ నామినేషన్‌ను ఎన్నికల అధికారికి అందజేశారు.

కూటమిలో అంతర్గత పోరు

కృష్ణా జిల్లాలో.. కూటమిలో మచిలీపట్నం మేయర్‌ అభ్యర్థిగా టీడీపీకి చెందిన షేక్‌ అబ్దుల్‌ అబీదాను అనూహ్య పరిణామాల అనంతరం శనివారం సాయంత్రం ఎట్టకేలకు ఖరారు చేశారు. కార్పొరేటర్‌ స్థానాలు ఎవరికి ఎన్ని అనే విషయం మాత్రం ఇంకా తేలలేదు. కృష్ణా జిల్లాలో టీడీపీ మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు, జనసేన ఎంపీ బాలశౌరి ఉన్నా సీట్ల పంచాయితీ తేల్చలేకపోయారు. పెడన జనసేనకు కేటాయించడంతో అక్కడ చైర్మన్‌ అభ్యర్థిగా మట్టా శివపావని, ఉయ్యూరు మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి చేదుర్తుపాటి ప్రవీణ్‌కుమార్‌ను టీడీపీ ఖరారుచేసింది. మరోవైపు మచిలీపట్నం కార్పొరేషన్‌తో పాటు మిగతా రెండు మున్సిపాలిటీల్లో కూడా జనసేన అధిక స్థానాలు ఆశిస్తుండడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది.

చిలకలపూడి(మచిలీపట్నం): మునిసిపల్‌ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండో రోజైన శనివారం జిల్లాలోని మూడు మునిసిపాల్టీల్లో 210 నామినేషన్లు దాఖలయ్యాయి. మచిలీపట్నం నగరపాలక సంస్థలో 129 నామినేషన్లు కార్పొరేటర్ల స్థానాలకు వేశారు. పెడన మునిసిపాల్టీలో 25 నామినేషన్లు కౌన్సిలర్ల స్థానానికి, ఉయ్యూరు మునిసిపాల్టీలో 52 నామినేషన్లు కౌన్సిలర్ల స్థానాలకు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement