దేవుడి హుండీ.. నేతల గండి! | - | Sakshi
Sakshi News home page

దేవుడి హుండీ.. నేతల గండి!

Sep 26 2026 2:08 AM | Updated on Sep 26 2026 2:08 AM

దేవుడి హుండీ.. నేతల గండి!

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణా జిల్లాలో దేవదాయశాఖ ఆలయాలను ప్రయివేటుకు ధారదత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు సనాతన ధర్మ పరిరక్షణ అంటూ ప్రచారార్భాటాలు చేస్తూ ఆలయాల ఆస్తులను ప్రయివేట్‌ వ్యక్తులకు కట్టబెట్టేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలను కాపాడాల్సిన ప్రభుత్వం నేతల సిఫారస్‌లతో మినహాయింపులు కల్పిస్తూ జీవోలు జారీ చేయటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిదానంగా దేవదాయ ధర్మదాయ శాఖ పరిధిలోని ఆలయాలను వాటి ఆధీనంలో ఉన్న ఆస్తులను ఒకొక్కటిగా దోచుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అడ్డగోలుగా జీవోలు...

రాష్ట్రంలో పాలక పక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సిఫార్సులతో అక్రమార్కులు ఆలయాల వ్యవహారాల్లో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. దేవదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాల పరిరక్షణకు చర్యలు చేపట్టేందుకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన కూటమి నేతలు వాటికి భిన్నమైన నిర్ణయాలను అమలు చేయాలంటూ ఆ శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో కొందరు అధికారులు సైతం అందినకాడిని పుచ్చుకొని ఉత్తర్వులు జారీ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా కూటమి నేతల సిఫారస్‌లో ఒక ఆలయానికి మినహాయింపులు ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అలాగే ఆలయాల ట్రస్ట్‌ బోర్డులకు పాలకమండళ్లను నియమించే సమయంలోనూ అర్హతలు లేకున్నా సిఫారస్‌లతో కమిటీలను నియమిస్తున్నారు. వాటిపై విమర్శలు రావటంతో వాటిని రద్దు చేసి మళ్లీ కమిటీలను వేస్తున్నారు. తాజాగా విజయవాడ పాతబస్తీలోని ఆలయాలకు కమిటీల నియామక ఉత్తర్వులు జారీ చేసి మళ్లీ రద్దు చేసిన ఘటనలు ఉన్నాయి.

కోర్టు కేసులు ఉన్నా జీవో జారీ..

కృష్ణాజిల్లాలో తోట్లవల్లూరు మండలంలో శ్రీ భ్రమరాంబ చెన్న మల్లేశ్వరస్వామి ఆలయం దేవదాయ ధర్మదాయ శాఖ పరిధిలో ఉంది. దానికి 90 ఎకరాలు ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వాటి ద్వారా సుమారు రూ.12 లక్షల ఆదాయం ఆలయానికి సమకూరుతోంది. దానికి దేవదాయ శాఖ చట్టం 1987 సెక్షన్‌ 15, 29 కింద (ట్రస్ట్‌బోర్డు, ఈవో లేకుండా) ఉన్న నిబంధనల కార్యకలాపాల నుంచి ఐదేళ్ల పాటు మినహాయింపు ఇస్తూ రెవెన్యూ ఎండోమెంట్‌ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ కన్నబాబు పేరిట ఈ నెల 22వ తేదీన ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీని వెనుక కూటమి నేతల సిఫార్సులున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఆలయ వ్యవహారం కోర్టులో పెండింగ్‌లో ఉందని, ఈ నెల 28వ తేదీన విచారణ ఉన్నట్లు తెలిసింది. అయినప్పటికీ అడ్డగోలుగా దీనికి మినహాయింపు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

లీజు వ్యవహారాల్లోనూ చక్రం తిప్పుతున్న నేతలు..

ఉమ్మడి జిల్లాలో వివిధ ఆలయాలు, సత్రాలకు సంబంధించిన దుకాణాల లీజు వ్యవహారాల్లోనూ కూటమి నేతలు తమ సిఫారస్‌లతో చక్రం తిప్పుతున్నారు. ప్రధానంగా ఆలయాల దుకాణాలు లీజుకిచ్చే క్రమంలో తప్పనిసరిగా బహిరంగ వేలం పాటను నిర్వహించి అత్యధికంగా లీజు చెల్లించేందుకు ముందుకు వచ్చిన వారికి ఆయా దుకాణాలను అప్పగించటం పరిపాటి. ఇది లీజు కాల పరిమితి పూర్తవ్వగానే నిర్వహించాలి. కాల పరిమితి ముగిసిన దుకాణాలకు ఆ శాఖలో ఉన్న నిబంధనల మేరకు లీజు మొత్తంలో సగం కన్నా అధికంగా చెల్లించేందుకు ఆ లీజుదారుడు ముందుకు వస్తే దానిని పరిశీలించి కమిషనర్‌ అనుమతితో రెన్యువల్‌ చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. కానీ కూటమి నేతల అండదండలతో కేవలం పది శాతం పెంపుతో రెన్యువల్‌ చేస్తున్నారనే పలువురు ఆరోపిస్తున్నారు.

సనాతనం అంటూనే ఆదాయం లూటీ..

కూటమి నేతలు ఒకవైపు సనాతనం అంటూనే మరోవైపు ఆదాయాలను కొల్లగొడుతున్నారని ధార్మిక సంఘాలు, వ్యక్తులు విమర్శిస్తున్నారు. సనాతన ధర్మం పేరుతో విష ప్రచారాలను వ్యాప్తి చేస్తున్న కూటమి నేతలు అదే తరహాలో ఆలయాలకు వచ్చే ఆదాయాలకు గండి కొడుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సాక్షాత్‌ కమిషనర్‌ కార్యాలయం అడ్డాగా పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఇటీవల అక్కడ పని చేసే ఉద్యోగులే బహిరంగంగా చెప్పడం, తోటి ఉద్యోగులు బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు సైతం చేస్తుస్తుండటం పరిస్థితికి అద్దం పడుతోంది.

ప్రయివేట్‌కు దేవదాయ శాఖ వత్తాసు

కూటమి ఒత్తిళ్లతో దిగజారుతున్న జిల్లాలో దేవాలయాల పరిస్థితి

ఆలయాల ఆదాయానికి గండి కొడుతున్న నేతల తీరు

తోట్లవల్లూరులోని ఒక ఆలయాన్ని ప్రయివేటుకు మినహాయింపిస్తూ జీవో

కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా జీవో ఎలా ఇస్తారని భక్తుల ప్రశ్న

దుకాణాల లీజు వ్యవహారాల్లోనూ చక్రం తిప్పుతున్న కూటమి నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement