పటమట(విజయవాడతూర్పు): పోటీ పరీక్షలో సెల్‌ఫోన్‌లో చూసి సమాధానాలు రాస్తున్న ఓ అభ్యర్థి శుక్రవారం ఇన్విజిలేటర్‌కు పట్టుబడ్డాడు. దీనిపై విజయవాడ పటమట పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనికేపాడులోని శ్రీ విజయ దుర్గా ఐటీ ఎగ్జామ్ సెంటర్‌లో ఏపీ స్టేట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం పరీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ఓ అభ్యర్థి సెల్‌ఫోన్‌లో చూస్తూ పరీక్ష రాస్తుండటాన్ని ఇన్విజిలేటర్ గుర్తించారు. వెంటనే అతడిని నిలువరించి, అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఘటనపై పటమట పోలీసులకు సమాచారం అందించారు. అభ్యర్థితో పాటు సెల్‌ఫోన్‌ను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లి నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష రాసిన వ్యవహారంపై అధికారులు కూడా తదుపరి చర్యలు చేపట్టినట్లు తెలిసింది.
●సెల్ ఫోన్ స్వాధీనం
●ఎనికేపాడు కేంద్రంలో ఘటన


