ఐ.పోలవరం: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని యానాం నుంచి కృష్ణా జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై ఎంవీవీ రవీంద్రబాబు కథనం ప్రకారం.. ఐ.పోలవరం మండలంలోని పాత ఇంజరం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో యానాం వైపు నుంచి వస్తున్న ఏపీ 39 టీయూ 1898 నంబర్ కారును ఆపి తనిఖీ చేశారు. అందులో ఏడు బాక్సుల్లో ఉన్న వివిధ రకాల 36 మద్యం బాటిళ్లను గుర్తించారు. కారులో ఉన్న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని, మద్యం, కారును స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
పట్టివేత వెనుక మరో కోణం!
ఈ మద్యం పట్టివేత వెనుక మరో కోణం ఉందని స్థానికులు అంటున్నారు. ఓవర్‌టేక్ విషయంలో మద్యం తరలిస్తున్న కారును మరో కారు యజమాని అడ్డుకుని మురమళ్ల సమీపంలో వాగ్వాదానికి దిగినట్లు వారు చెబుతున్నారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో మద్యం తరలిస్తున్న కారు అద్దాలు పగిలాయి. అదే సమయంలో అటుగా వెళుతున్న ముమ్మిడివరం సీఐ మోహన్ కుమార్ వారి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఆ కారులో మద్యం బాటిళ్లున్న విషయం గుర్తించారని, దీనిపై సమాచారం అందడంతో పోలీసులు ఆ మద్యం స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. అసలు ఏం జరిగిందనే విషయం పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.


