ఉయ్యూరు: అంతర్‌రాష్ట్ర నేరస్తుడిని ఉయ్యూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని శుక్రవారం ఉయ్యూరు సర్కిల్ కార్యాలయంలో సీఐ రామారావు మీడియా ఎదుట హాజరు పరిచారు. సీఐ రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి రహిత ఉయ్యూరు లక్ష్యంగా పోలీసులు దాడులు చేపట్టారు. గత కొన్ని రోజులుగా చేస్తున్న దాడుల్లో 12 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రాబట్టిన సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌కు చెందిన బండారి శివను రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిధిలో అనాసపురకు చెందిన వాడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. శివ హైదరాబాద్ నుంచి ఏఓబీ ఏరియాకు గంజాయి కోసం వెళుతూ మార్గంమధ్యలో మూడు బైక్‌లు దొంగిలించాడు. ఆ బైక్‌లను ఒడిశాలో అమ్మేసి ఆ డబ్బులతో గంజాయి కొని అమ్మకాలు సాగిస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బృందం శివను అదుపులోకి తీసుకుని ఉయ్యూరుకు తరలించారు. 20 కేసుల్లో శివ నిందితుడిగా ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. శివను అరెస్టు చేసి శుక్రవారం న్యాయస్థానంలో హాజరు పర్చటంతో న్యాయమూర్తి 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించారని సీఐ తెలిపారు. నిందితుడిని గన్నవరం సబ్‌జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. ఎస్‌ఐలు ప్రతాప్‌రెడ్డి, మల్లికాసులు పాల్గొన్నారు.


