గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల సంఖ్య తక్కువ చేసి నోటిఫికేషన్ జారీ చేసిందని, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) ఆరోపించింది. శుక్రవారం విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యాన పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల పోరుబాట పేరుతో చలో విజయవాడ కార్యక్రమం జరిగింది. డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు, నిరుద్యోగులు ధర్నా చేశారు. అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరిన డీఐఎఫ్‌ఐ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులు, డీవైఎఫ్‌ఐ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య తక్కువగా చూపిందన్నారు. కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచి సవరణ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులపై వేధింపులు, నిర్బంధం ఆపాలని డిమాండ్ చేశారు. పోలీసు కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య 11,639లకు పెంచాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కోశాధికారి అబ్దుల్లా, రాష్ట్ర నేతలు వీరేష్, అంజనేయరాజు, గణేష్, శివ, సురేంద్ర బాబు, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు ప్రభుత్వాన్ని
హెచ్చరించిన డీవైఎఫ్‌ఐ


