ఉయ్యూరు: వినియోగదారుడిలా సెల్‌ఫోన్ దుకాణానికి వెళ్లి ఫోన్‌లు చోరీ చేస్తున్న నిందితుడిని ఉయ్యూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ మేరకు పట్టణ పోలీసుస్టేషన్‌లో సీఐ టీవీవీ రామారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ...ఉయ్యూరు మండలం చిన ఓగిరాలకు చెందిన దండుగుల నాగదుర్గారావు సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్నాడు. సెల్‌ఫోన్ దుకాణాలకు కొనుగోలుదారుడిలా వెళ్లి వివిధ మోడల్స్ ఫోన్‌లు పరిశీలిస్తున్నట్లు నటిస్తూ ఫోన్లు చోరీ చేస్తున్నాడు. పట్టణంలోని ఓ సెల్‌ఫోన్ దుకాణానికి పలుమార్లు కస్టమర్‌లా వెళ్లి సెల్‌ఫోన్‌లు చోరీకి పాల్పడటంతో ఘటనపై ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి దర్యాప్తు చేపట్టి నిందితుడు నాగదుర్గారావును మంగళవారం అరెస్టు చేసి రూ.లక్ష విలువ చేసే ఐదు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో తోట్లవల్లూరు పోలీసుస్టేషన్ పరిధిలో ఓ దేవాలయంలో చోరీ ఘటన కేసు ఉంది. నిందితుడిని ఉయ్యూరు జూనియర్ సివిల్‌కోర్టులో హాజరుపర్చటంతో 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ రామారావు తెలిపారు. నాగదుర్గారావును గన్నవరం సబ్‌జైలుకు తరలించామన్నారు.


