సీతానగరం: పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని ఏగోటివలసలో గల తోటపల్లి కాలువలో పడి కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రాంతానికి చెందిన మధుకోటి హేమంత్ కృష్ణ మంగళవారం గల్లంతయ్యాడు. దీనిపై స్థానికులు అందించిన వివరాల ప్రకారం.. ఏగోటివలస గ్రామానికి చెందిన ఎస్.పోలినాయుడు, గల్లంతైన హేమంత్ కృష్ణ స్నేహితులు. వారిద్దరూ ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ విభాగంలో పని చేస్తున్నారు. మంగళవారం పోలినాయుడు ఇంట్లో కుమార్తె బాలసారె కార్యక్రమానికి హేమంత్ కృష్ణను ఆహ్వానించాడు. సోమవారం రాత్రి ఏగోటివలస గ్రామానికి చేరుకున్న హేమంత్ కృష్ణ మంగళవారం ఉదయం బహిర్భూమితో పాటు స్నానం కోసం గ్రామాన్ని ఆనుకుని ఉన్న తోటపల్లి కాలువ దగ్గరకు వచ్చాడు.
అక్కడ కాలకృత్యాలు తీర్చుకుంటుండగా హేమంత్ కృష్ణ(39) ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి గల్లంతయ్యాడు. వెంటనే గ్రామస్తులు కాలువలో దిగి గల్లంతైన వ్యక్తిని వెతకడం ప్రారంభించారు. అప్పటికే ఎడతెరిపి లేని వర్షం పడుతుండడంతో వెతకడం కష్టంగా మారింది. అనంతరం పోలీసులు, ఫైర్ సిబ్బంది కాలువలో గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సంఘటనా స్థలానికి తహసీల్దార్ ఎం.ప్రసన్నకుమార్, ఎంపీడీఓ ఎంఎల్‌ఎన్ ప్రసాద్, ఎస్సై ఎం.హేమలత చేరుకుని వివరాలు అడిగి తెలుసుకుని గల్లంతైన వ్యక్తిని గుర్తించడానికి చర్యలు చేపట్టారు. గాలింపు కొనసాగుతోంది. కార్యక్రమంలో డెప్యూటీ ఎంపీడీఓ కె.కుమారవర్మ, ఆర్‌ఐ ఎన్.శ్రీనివాసరావు వీఆర్వో ఆనందరావు పాల్గొన్నారు.


