ఘంటసాల: ముస్లిం సోదరుడు షేక్ బాషా వినాయ చవితి వేడుకలు నిర్వహించడం ఆదర్శనీయమని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ఘంటసాల గ్రామంలో శ్రీజలధీశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకల్లో ఆయన కుటుంబ సమేతంగా మంగళవారం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ముస్లిం అయ్యిండి రెండేళ్లుగా వినాయక చవితి వేడుకలను నిర్వహిస్తున్న షేక్ బాషా(షామియానా) ఆదర్శంగా నిలిచాడని అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ, దోనేపూడి బుజ్జి, మొవ్వ కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. తొలుత ఘంటసాల గ్రామంలో వేం చేసి ఉన్న శ్రీ బాలపార్వతీ సమేత శ్రీజలధీశ్వర స్వామిని జస్టిస్ ఎ.వెంకటేశ్వర రెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. స్వామివారికి అభిషేకాలు, అమ్మ వారికి అర్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చావలి కృష్ణ కిషోర్ ఆశీర్వచనాలు అందించారు.
భక్తులకు అన్నదానం..
బాషా, గ్రామస్తులు, కమిటీ వారి సహకారంతో ఏర్పాటు చేసిన భారీ అన్నసమారాధనను మంగళవారం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు ప్రారంభించారు. అన్న సమారాధనలో 3 వేలకు పైగా భక్తులు పాల్గొన్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.


