మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): తమ అబ్జర్వర్ (పరిశీలకుడు) లేకుండా నిర్వహించిన ఏ క్రీడా సంఘం ఎన్నికలు చెల్లవని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) కార్యాలయ సిబ్బంది స్పష్టం చేశారు. రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నూతన కమిటీ ఎన్నిక ఇటీవల తాడేపల్లిలోని ఒక క్లబ్‌లో శాప్ నుంచి పరిశీలకుడు హాజరు కాకుండానే ఎన్నిక నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ అంశంతో పాటుగా రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన పలు వ్యవహారాల గురించి ఈ నెల 11వ తేదీన ‘సాక్షి’ పత్రిక 10వ పేజీలో ‘స్వప్రయోజనాలే గురి’ పేరుతో కథనం ప్రచురితమైంది. అసోసియేషన్‌లో జరుగుతున్న ఈ పరిణామాలను తెలుసుకున్న షూటర్స్ పేరెంట్స్ నగరంలోని శాప్ కార్యాలయానికి వెళ్లి అక్కడి అధికారులను కలిసి వివరణ అడిగారు. శాప్ పరిశీలకుడు లేకుండా నిర్వహించిన ఎన్నిక చెల్లుతోందా, అలాంటి అసోసియేషన్ నుంచి జారీ చేసిన సర్టిఫికెట్లకు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందా, వాటికి విలువ ఉంటుందా అనే సందేహాలను తల్లిదండ్రులు శాప్ అధికారులను ప్రశ్నించారు. శాప్ కార్యాలయం సిబ్బంది స్పందించి శాప్ పరిశీలకుడు లేకుండా నిర్వహించిన ఏ ఎన్నిక చెల్లదని, అలాంటి అసోసియేషన్‌కు తాము గుర్తింపు కూడా ఇవ్వమని తల్లిదండ్రులకు స్పష్టం చేశారు. ఈ విషయాలను వివరిస్తూ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నూతన కమిటీలోని అధ్యక్షుడికి తెలియజేస్తూ శాప్ కార్యాలయ సిబ్బంది లేఖను పంపారు. ఈ లేఖను నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్‌కు కూడా పంపారు. త్వరలోనే రైఫిల్ షూటింగ్‌లో శిక్షణ పొందుతున్న వారి తల్లిదండ్రులు సమావేశం నిర్వహించనున్నారు.


