పెడన: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర డ్రెయినేజీ బోర్డు మాజీ డైరెక్టర్, పీసీసీ మాజీ సభ్యుడు ఎండీ మతీన్(79) బుధవారం రాత్రి మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురై చికిత్స తీసుకుంటూ ఇంటి వద్దే ఉంటున్నారు. ఈయనకు భార్య దిల్షద్‌బేగం, ఇద్దరు కుమార్తెలు రేష్మ, కరిష్మాలు. కుమార్తెలు ఇరువురికి కూడా వివాహాలయ్యాయి. ఈయన మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేస్తూ మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
శ్రేయోభిలాషిని కోల్పోయా: పేర్ని నాని
ఎండీ మతీన్ నుంచి తాను రాజకీయాలు కొంత మేర నేర్చుకున్నా, ఆయనతో సన్నిహిత సంబంధాలున్నాయని, కుటుంబపరంగా మంచి స్నేహితుడు, మంచి శ్రేయోభిలాషిని కోల్పోయానని రాష్ట్ర మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్నివెంకట్రామయ్య(నాని) అన్నారు. పెడనలోని మతీన్ గృహానికి నాని, జయసుధ దంపతులు చేరుకుని మతీన్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ ఇన్‌చార్జి ఉప్పాల రాము, వైఎస్సార్ సీపీ నాయకులు బళ్ల గంగయ్య, కమాల్‌బేగ్, భండారు మల్లికార్జునరావు, ఎండీ ఖాజా, కోడూరు శ్రీను, వన్నెంరెడ్డి మహాంకాళరావు, దివాకర్ తదితరులున్నారు. అనంతరం సాయంత్రం జరిగిన మతీన్ అంత్యక్రియల్లో పేర్నినాని పాల్గొన్నారు. అలాగే పెడన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, అబ్దుల్ ఖయ్యూం, కాంగ్రెస్ పార్టీ నాయకులు యర్రా నాగేశ్వరరావు, కొల్లూరి నాగభూషణం, సీహెచ్ అప్పారావు తదితరులు మతీన్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.


