బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌పై కారులో మంటలు | - | Sakshi
Sakshi News home page

బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌పై కారులో మంటలు

Sep 11 2026 11:03 AM | Updated on Sep 11 2026 11:03 AM

పూర్తిగా దగ్ధమైన కారు, అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం

కృష్ణలంక(విజయవాడతూర్పు): నగరంలో బెంజి సర్కిల్‌ ఫ్లై ఓవర్‌పై అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టెస్ట్‌ డ్రైవ్‌ చేస్తుండగా ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లో పూర్తిగా దగ్ధమైంది. సమయానికి వెనకాల వస్తున్న వాహనదారుడు అప్రమత్తం చేయడంతో మెకానిక్‌ ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. సేకరించిన వివరాల మేరకు.. నగరానికి చెందిన ఒక వ్యక్తి తన కారును రిపేర్‌ నిమిత్తం మహానాడు రోడ్డులోని అంబికా డీజిల్‌ వర్క్స్‌ మెకానిక్‌ షాప్‌నకు ఇచ్చాడు. రిపేర్‌ పనులు పూర్తయిన తర్వాత కారును మెకానిక్‌ గుడిసె అభినవ్‌ టెస్ట్‌ డ్రైవ్‌కు తీసుకెళ్లాడు.

అకస్మాత్తుగా మంటలు..

గురువారం మధ్యాహ్నం సుమారు 12:40 గంటల సమయంలో స్క్రూబ్రిడ్జి వద్ద యూటర్న్‌ తీసుకుని షాపునకు వెళ్లే క్రమంలో బెంజిసర్కిల్‌ ఫ్లైఓవర్‌ ఎక్కి జ్యోతి కన్వెన్షన్‌ ఎదురుకు చేరుకోగానే కారు వెనుక భాగం నుంచి పొగలు రావడం ప్రారంభమయ్యాయి. దానిని గమనించిన ఒక ద్విచక్ర వాహనదారుడు కేకలు వేసి డ్రైవర్‌ను అప్రమత్తం చేశాడు. వెంటనే డ్రైవర్‌ కారును ఫ్లైఓవర్‌పై ఆపి బయటకు దిగిపోయాడు. అతను దిగిన కొద్ది క్షణాల్లోనే మంటలు కారంతా వ్యాపించి అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అప్పటికే కారు పూర్తిగా కాలి బూడిదైంది. కారును నడుపుతున్న మెకానిక్‌ సకాలంలో బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. కారులో సంభవించిన సాంకేతిక లోపం లేదా ఎలక్ట్రికల్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని ఫైర్‌ సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement