ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయం సరఫరా చేయడమే లక్ష్యంగా సంస్థలోని సిబ్బంది విధులు నిర్వర్తించాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పి. పుల్లారెడ్డి చెప్పారు. స్థానిక గుణదలలోని ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా సర్కిల్ పరిధిలోని అధికారులతో సమీక్ష సమావేశం గురువారం జరిగింది. పుల్లారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడినప్పుడు అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించి నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను కనిష్ట స్థాయికి తీసుకురావాలని, విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పీక్ అవర్స్‌లో ఎటువంటి అంతరాయాలు తలెత్తకుండా ముంద స్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు.
వేగంగా డిజిటలైజేషన్..
వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచు కుని విద్యుత్ సేవలను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తున్నామని, వినియోగదారుల సమస్యల పరిష్కారంలో 1912 నంబరు ద్వారా సేవలను సమర్థంగా అందిస్తున్నామని సీఎండీ చెప్పారు. నూతన విద్యుత్ కనెక్షన్ దరఖాస్తులను కూడా 1912 ద్వారా స్వీకరించే విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఏపీసీపీడీసీఎల్ ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టీవీఎస్‌ఎన్ మూర్తి, ఎన్టీఆర్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ యు.హనుమయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు విశ్వేశ్వర ప్రసాద్, రాజమోహన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.


