వేసవిని మించి ఎండలు ఎండుతున్న మిరప మొక్కలు కాపాడుకునేందుకు రైతన్నల పాట్లు
భారీగా పెట్టుబడులు...
మునేరు కూడా అడుగంటింది
పెనుగంచిప్రోలు: ఎల్‌నినో ప్రభావంతో వర్షాల జాడ లేకుండా పోయింది. ఎండలు వేసవిని తలపిస్తుండటంతో మిరప మొక్కలు వడలిపోతున్నాయి. వర్షం కోసం రైతులు ఆశగా ఎదురుచూడటం తప్ప వరుణుడు ఏమాత్రం కరుణించడం లేదు. కళ్ల ముందే వేసిన మిరప మొక్కలు ఎండిపోతుండటంతో మిర్చి రైతులు, దిగుబడుల సంగతి అటుంచి చివరికి మొక్కలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. వర్షాలు పడక, సాగర్ జలాల ఊసులేక పోవడంతో మిరప మొక్కలు చనిపోకుండా ఉండేందుకు రైతులు ట్యాంకర్ల ద్వారా పొలాలకు నీరు పెట్టుకుంటున్నారు ఇందుకోసం అదనంగా ఖర్చు చేస్తున్నారు. అలాగే పొలాల్లో నీటివినియోగం తగ్గించుకునేందుకు స్పింకర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు.
15వేల ఎకరాల్లో మిరప సాగు...
గతేడాది దిగుబడులు తగ్గడంతో ప్రస్తుతం మిర్చికి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ ఏడాది కూడా అధిక ధరలు ఉంటాయనే ఆశతో రైతులు మిరప సాగుకు సమాయత్తమయ్యారు. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో ఏటా 20 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తుండగా, ఈఏడాది వర్షాలులేక సాగు ఆలస్యమైంది. ప్రస్తుతానికి సుమారుగా 15 వేల ఎకరాల్లో మిర్చిసాగు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అడపాదడపా పడుతున్న వర్షపు జల్లులకు రైతులు నర్సరీల నుంచి మిరప మొక్కలను తెచ్చి నాటుతున్నారు. వాటిని కాపాడుకునేందుకు పొలాల్లో కొత్తగా బోర్లు వేస్తున్నారు. పాత బావుల పూడికలు తీస్తున్నారు. బావులు ఉన్న చోట నుంచి అర కిలోమీటరు నుంచి కిలో మీటరు వరకు కూడా పైపులు ఏర్పాటు చేసుకుని మొక్కలకు నీరు అందిస్తున్నారు.
నీటితడికి ఎకరానికి రూ.4 వేలు...
ఇప్పటికే మిర్చి సాగుకు ఎకరానికి రైతులు రూ.50 నుంచి రూ.60 వేల వరకు పెట్టుబడులు పెట్టారు.నీటివసతి లేని రైతులు బావి లేదా బోరు వసతి ఉన్న రైతు దగ్గర నుంచి పొలాన్ని తడి పెట్టేందుకు ఎకరానికి రూ.4వేలు వసూలు చెల్లిస్తున్నారు. గతంతో పోలిస్తే మిర్చికి పెట్టుబడులు బాగా పెరిగాయని ఎకరానికి రూ.2లక్షల నుంచి రూ.2.50 లక్షలకు పైగా పెట్టుబడి అవుతోందని రైతులు చెబుతున్నారు. ఈఏడాది మొదటి నుంచో పెట్టుబడులు పెరిగాయని, సాగుకాలం పూర్తయ్యేనాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎల్‌నినో ప్రభావంతో అడపాదడపా జల్లులు పడటం తప్ప పెద్ద వర్షాలు కురవటం లేదు. జులై నెలలో మిర్చి మొక్కలు నాటాల్సి ఉన్నా ప్రతికూల వాతావరణంతో సెప్టెంబర్ నెల వచ్చినా మొక్కలు నాటుతూనే ఉన్నారు. మొక్కలు బతికించుకోవటానికి మొదటి నుంచే ట్యాంకర్లు ద్వారా నీళ్లు పెట్టాల్సి వస్తోంది.
– రామారావు, రైతు, ముండ్లపాడు
ఇప్పటికే ఎకరానికి రూ.60 వేలు వరకు పెట్టుబడి అయింది. ఒకో మిర్చి మొక్క రూ.1 నుంచి రూ.1.50 పైసలకు కొనుగోలు చేశాం. ఎకరానికి 13వేల మొక్కలు వరకు వేశాం. ప్రస్తుతానికి మునేరు ఎత్తిపోతల పథకం అప్పడప్పుడు ఆదుకుంటోంది. మునేరులో కూడా అడుగంటింది. స్కీం కూడా ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
– దురిశాల మురళి, రైతు, పెనుగంచిప్రోలు


