ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సార్‌ సీపీదే విజయం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సార్‌ సీపీదే విజయం

Sep 7 2026 7:45 AM | Updated on Sep 7 2026 7:45 AM

28 డివిజన్లలో గెలుపే లక్ష్యం

జగన్‌ సంక్షేమ పాలనకు ప్రజలే మరోసారి పట్టం కడతారు పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ ప్రజాతీర్పుతో కూటమికి గుణపాఠం తప్పదు: వెలంపల్లి శ్రీనివాసరావు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): నగరపాలక సంస్థకు ఎన్నికలెప్పుడొచ్చినా వైఎస్సార్‌ సీపీదే విజయమని ఆ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ ధీమా వ్యక్తం చేశారు. భవానీపురంలో పశ్చిమ నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. తొలుత మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి దేవినేని అవినాష్‌, వెలంపల్లి శ్రీనివాస్‌.. పార్టీ నేతలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ వెన్నుపోటు పార్టీ, వెన్నుపోటు పాలన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వైఎస్సార్‌ సీపీ కార్యాచరణ సిద్ధం చేసింది. అనంతరం దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ కూటమి పాలనలో ఎటువంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు లేవన్నారు. వైఎస్సార్‌ సీపీ పాలనలో రోడ్లు, పార్క్‌లు, వాటర్‌ట్యాంకులు ప్రారంభిస్తే కూటమి నేతలు సిగ్గు లేకుండా సొంత పార్టీ కార్యాలయాలు ప్రారంభిస్తున్నారన్నారు. మనం ప్రజల కోసం పనిచేస్తే.. కూటమి ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం పని చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు. పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలను వివరిస్తే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్‌గా గెలిచేది మరోసారి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థేనని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎంత మంది పోలీసులు వచ్చినా, గుండాలు, రౌడీలు వచ్చినా పార్టీ కార్యకర్తలకు పూర్తి అండగా ఉంటామని పేర్కొన్నారు.

వెన్నుపోటు పాలనకు రెండున్నరేళ్లు..

వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోందన్నారు. ప్రజానీకానికి కూటమి వెన్నుపోటు పొడిచిన విధానాన్ని ఈ నెల 23 నుంచి వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నారు. పాంప్లెట్‌లు, క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయించి ప్రజానీకానికి తెలియజేయాలన్నారు. బూత్‌ లెవల్‌ ఏజెంట్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. నియోజకవర్గానికి సుమారు ఏడు వేల మందికి పార్టీ పదవులు ఇచ్చారని, వారంతా అప్రమత్తంగా ఉంటూ పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు.

పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్‌ సీపీ సిద్ధంగా ఉందన్నారు. నియోజకవర్గంలోని 28 డివిజన్లలో పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. ఇంటింటికీ వైఎస్సార్‌ సీపీ కార్యక్రమంలో కూటమి పాలన వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా వెల్లడిస్తారని, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల తీర్పును ఇస్తారన్నారు. అనంతరం పార్టీల్లో వివిధ పదవుల్లో నియమితులైన ప్రతినిధులకు గుర్తింపు కార్డులు అందజేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, మాజీ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ ఆసిఫ్‌, గుంటూరు పార్లమెంట్‌ పరిశీలకులు పోతిన మహేష్‌, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుణ్యశీల, తోలేటి శ్రీకాంత్‌, మనోజ్‌ కొఠారి, గౌస్‌ మొహిద్దీన్‌, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement