సాగునీరు అందక యండపల్లి రైతుల వినూత్న నిరసన పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వమేనంటూ ఆందోళన
కృత్తివెన్ను: పంట భూములకు సాగునీరందించాల్సిన కాలువలు నీటి జాడ లేక ఎండిపోవడంతో రైతులు వినూత్న నిరసనకు దిగారు. కాలువలో నీరు లేకపోవడంతో ఏకంగా దానిలోనే వరినాట్లు వేసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కృత్తివెన్ను మండలం యండపల్లి పంచాయతీ పరిధిలోని యండపల్లి, గాంధీనగరం రైతులు పార్టీలకతీతంగా ఆదివారం బంటుమిల్లి–లక్ష్మీపురం ప్రధాన పంటకాలువలో వరినాట్లు వేసి నిరసన తెలిపారు.
నీరున్నా.. చేరడం లేదు
గుడ్లవల్లేరు లాకుల నుంచి వంతులవారీగా బంటుమిల్లి కెనాల్‌కు 250 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నప్పటికీ నెల రోజులుగా కృత్తివెన్నుకు చుక్కనీరు చేరడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని, పాలకులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
150 ఏళ్లలో ఇదే దుస్థితి
బంటుమిల్లి–లక్ష్మీపురం ప్రధాన పంటకాలువకు సుమారు 150 ఏళ్ల చరిత్ర ఉందని, ఇంతటి దుర్భర పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని రైతులు తెలిపారు. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నీటితో కళకళలాడాల్సిన కాలువలు ఎండిపోవడం దారుణమన్నారు.
నాట్లు వేసిన పంటలూ ఎండిపోయాయి
మండలంలో ఈ ఏడాది సుమారు 7 వేల ఎకరాల్లో ఖరీఫ్ నాట్లు వేయాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 2 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. అందులో దాదాపు 90 శాతం పంట నీరు లేక ఎండిపోయిందని రైతులు చెబుతున్నారు. తక్షణమే కృత్తివెన్నుకు కాలువల ద్వారా సాగునీరు అందించా లని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
గెజిట్‌లో హామీ.. నీరెక్కడ?
కృత్తివెన్ను శివారు ప్రాంతంతో పాటు సముద్రతీరానికి సమీపంలో ఉండటంతో రెండో పంట రబీకి కూడా సాగునీరు అందించేలా గతంలో అప్పటి మల్లేశ్వరం ఎమ్మెల్యే పిన్నెంటి పమిడేశ్వరరావు ప్రభుత్వాన్ని ఒప్పించి గెజిట్‌లో పొందుపరిచేలా జీవో తీసుకొచ్చినట్లు రైతులు గుర్తుచేశారు. రెండో పంట సంగతి పక్కన పెడితే కనీసం ఒక్క పంటకై నా సాగునీరు అందించకపోవడంపై వారు ప్రశ్నించారు.


