సమస్యలు పరిష్కరించటం లేదు గ్రామ, వార్డు సచివాలయ జేఏసీ మహాసభలో ఉద్యోగులు
చిలకలపూడి(మచిలీపట్నం): తమతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు తప్ప సమస్యలు పరిష్కరించడం లేదని గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ గుర్రంకొండ సురేంద్ర పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో ఆదివారం గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగ జేఏసీ జోన్–2 తొలిదశ ఉద్యమ కార్యాచరణ సమాయత్త సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ.. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి బాధాకరమన్నారు. పెండింగ్‌లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలు, విధి నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. రూ.660 విలువ కలిగిన ఆటోమెటిక్ అడ్వాన్స్ స్కీం (ఏఏఎస్) ప్రయోజనాన్ని అమలు చేయడానికి సంవత్సర కాలంగా తాత్సారం చేయటం ఉద్యోగులపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం..
బీఎల్‌ఓ విధులు నిర్వహించిన ఉద్యోగులకు సంబంధించిన నిధులను సంవత్సర కాలంగా పెండింగ్‌లో ఉంచారన్నారు. మరో వైపు మూడు నెలలుగా సర్ పేరుతో సచివాలయ ఉద్యోగులతో ఆదివారం కూడా సెలవు లేకుండా నిరంతరం విధులు చేయిస్తూ మానసిక ఒత్తిడికి గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బగ్గా జగదీష్, జేఏసీ నేతలు హరీష్, చవెంకటేశ్వర్లు, రవితేజ, సిద్దేశ్వరరెడ్డి, పి.అపర్ణ, రామకృష్ణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మూడే చంద్రకుమార్, కృష్ణాజిల్లా చైర్మన్ పువ్వల కిరణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు.


