కంచికచర్ల: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలయినా విశ్రాంత ఉద్యోగులకు ఎటువంటి న్యాయం జరగలేదని, ఎన్నికల సమయంలో ఇస్తామని చెప్పిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని విశ్రాంత ఉద్యోగుల సంఘ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సానె రామ్మోహనరావు ఆరోపించారు. కంచికచర్లలోని ఏపీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సంఘ కార్యాలయంలో శనివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రామ్మోహనరావు మాట్లాడుతూ.. పింఛన్‌దారులకు 70, 75 సంవత్సరాలకు గతంలో తగ్గించిన క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ చేయలేదని, తమ నుంచి ప్రతి నెలా డబ్బులు మినహాయించుకున్నప్పటికీ హెల్త్ కార్డులపై వైద్యం జరిగే దిక్కులేదని మండిపడ్డారు. 12వ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేయలేదని, మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించలేదని, 2024న జనవరి నుంచి డీఏ అరియర్స్ ఇవ్వలేదని ఆరోపించారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించక పోతే త్వరలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం విజయవాడకు చెందిన మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆస్పత్రి వైద్యులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి పోతరాజు, అసోసియేట్ ప్రసిడెంట్ పెద్దినీడి కోటేశ్వరరావు, కోశాధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రిటైర్డ్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు రామ్మోహనరావు


