హనుమాన్‌జంక్షన్‌రూరల్: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్స్ పగలుకొట్టి రాగి తీగల చోరికి పాల్పడే అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను వీరవల్లి పోలీసులు పట్టుకున్నారు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు వివరాలను గన్నవరం డీఎస్పీ కె.ధర్మేంద్ర శుక్రవారం వెల్లడించారు. వీరవల్లి సమీపంలో 16వ నంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న పాత కెమికల్ ఫ్యాక్టరీ వద్ద కొంత మంది కాపర్ వైర్లు దొంగిలిస్తున్నట్లుగా వీరవల్లి ఎస్‌ఐ సత్యం సురేష్‌కు పక్కా సమాచారం అందటంతో తన సిబ్బందితో ఆ ప్రాంతానికి వెళ్లి పథకం ప్రకారం అక్కడ చోరికి పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులు, ఓ మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీసులు తనదైన స్టైల్‌లో విచారించటంలో ఈ దొంగల ముఠా చిట్టా విప్పారు. పోలీసులను పట్టుబడిన ఈ ముఠా సభ్యులను ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరంకు చెందిన పొట్లూరి ప్రభుదాస్ అలియాస్ నాని, పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన అల్లంశెట్టి భాగ్యరాజు, రావూరి కలగయ్య, రావూరి గోపి, బాపట్లకు చెందిన చేవూరి వంశీ కల్యాణ్, చేవూరి వెంకటేష్, నరసరావుపేటకు చెందిన మైనర్ బాలుడిగా పోలీసులు గుర్తించారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం, హనుమాన్‌జంక్షన్, ఆత్కూరు, వీరవల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో పలు చోరీలకు పాల్పడిన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై ఏలూరు జిల్లాలోని 10 పోలీస్‌స్టేషన్ల పరిధిలో నమోదైన 49 కేసులలో 72 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్స్ పగలుకొట్టి రాగి తీగల చోరికి పాల్పడినట్లు గుర్తించామని డీఎస్పీ ధర్మేంద్ర వివరించారు. ఈ ముఠా సభ్యులను గన్నవరం కోర్టుకు హజరు పర్చనున్నట్లుగా పేర్కొన్నారు. ఈ దొంగలను పట్టుకోవటంలో చాకచక్యంగా వ్యవహారించిన హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు, కానిస్టేబుల్ దుర్గారావులను డీఎస్పీ ధర్మేంద్ర ప్రత్యేకంగా అభినందించి, నగదు రివార్డును అందించారు. హనుమాన్‌జంక్షన్ సీఐ ఎల్.రమేష్, వీరవల్లి ఎస్‌ఐ సత్యం సురేష్ పాల్గొన్నారు.


