మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు 40 మంది ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లతో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగానికి చెందిన ఉపాధ్యాయులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. మచిలీపట్నం జెడ్పీ కన్వెన్షన్లో శనివారం నిర్వహించనున్న జిల్లా స్థాయి గురుపూజోత్సవం కార్యక్రమంలో వీరికి అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఉంగుటూరు మండలం జెడ్పీహెచ్‌ఎస్‌లో పనిచేస్తున్న సీహెచ్. అనిత, పెనమలూరు మండలం పోరంకి పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయురాలు ఎం.సుమలత, ఉంగుటూరు మండలం అట్కూరు జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం కె.విజయ్, గుడివాడ మండలం గంగాధరపురం జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం బి.ఎస్. నాగేశ్వరరావు తదితరులు ఎంపికయ్యారు. స్కూల్ అసిస్టెంట్ విభాగంలో ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్, బయోసైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర సబ్జెక్టులకు చెందిన ఉపాధ్యాయులకు అవకాశం లభించింది. మచిలీపట్నం మండలం పోతేపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఎం.రామాదేవి, టి.మురళీకృష్ణ, గుండుపాలెం జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన బి.సోమేశ్వరరావు, ఉయ్యూరు మండలం కడవకొల్లు జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన వి. బెణర్జీ సత్య విజయ్ తదితరులు జాబితాలో ఉన్నారు. ఎస్జీటీ విభాగంలో కూడా పలువురు ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. గన్నవరం, మోపిదేవి, తోట్లవల్లూరు, మొవ్వ, ఘంటసాల, కంకిపాడు, చల్లపల్లి తదితర మండలాలకు చెందిన ఉపాధ్యాయులు అవార్డుల జాబితాలో ఉన్నారు. ఉర్దూ బోధన విభాగంలో మిర్జా అఫ్సర్ అబ్బాస్, అలియా బేగం కూడా ఎంపికయ్యారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగంలో సుమయ్యా ఖాతూన్, ఎ.రాజేశ్వరి, వై.అనిల్‌కుమార్‌లకు స్థానం దక్కింది.
విజయవాడరూరల్: అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన గురువారం రాత్రి అంబాపురం గ్రామంలో జరిగింది. విజయవాడ నగరంలో వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని మాఫియా ముఠా మినీ వ్యానుల్లో నగర శివారులోని అంబాపురం తరలిస్తున్నారు. అక్కడి విక్రమ పబ్లిషర్స్ సమీపంలోని ఖాళీ స్థలంలో లారీల్లో లోడు చేస్తున్నారు. దీనిపై పౌర సరఫరాలశాఖ అధికారులకు సమాచారం అందింది. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి పి.వాణి ఆధ్వర్యంలో అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. 500 బ్యాగుల్లో 250 క్వింటాళ్ళ రేషన్ బియ్యంతో రవాణాకు సిద్ధం అవుతున్న లారీతో పాటు డ్రైవర్ బాలసుబ్రహ్మణ్యంను అదుపులోనికి తీసుకున్నారు. విజయవాడ కొత్తపేట పోలీసు స్టేషన్లో అప్పగించినట్లు ఏఎస్‌ఓ 3 లక్ష్మణ్‌బాబు తెలిపారు. 6ఎ కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో డిప్యూటీ తహసీల్దారు ప్రవీణ్‌రెడ్డి, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లు సుబ్రహ్మణ్యం, లతీఫాలున్నారు.
తోట్లవల్లూరు: కేఈబీ కాలువలో వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన మండలంలోని చాగంటిపాడు వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రొయ్యూరుకు చెందిన చప్పిడి తిరుపతిరావు(51)కు గేదెలు అమ్మే విషయమై భార్య శ్రీదేవితో వివాదం జరిగింది. దీంతో ఆయన ఈ నెల 2వ తేదీ రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తిరుపతిరావు ఆచూకీ కోసం గాలిస్తుండగా శుక్రవారం చాగంటిపాడు వద్ద కేఈబీ కాలువలో మృతదేహం లభ్యమైంది. మృతుని భార్య శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కిషోర్ తెలియజేశారు.
కలుపు మందు తాగి యువకుడు మృతి
తోట్లవల్లూరు శివారు అంబేడ్కర్ నగర్‌కు చెందిన గుమ్మడి వినోద్‌కుమార్(29) మనస్తాపంతో ఈ నెల 2వ తేదీ రాత్రి ఇంటి వద్ద కలుపు మందు తాగాడు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 4 న మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కిషోర్ తెలిపారు.


