ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించాలి | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించాలి

Sep 5 2026 7:37 AM | Updated on Sep 5 2026 7:37 AM

రైతులకు సాయంపై ప్రభుత్వం

ఆలోచన చేయాలి

ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌

కేవీకేలో ఎల్‌నినోపై అవగాహన సదస్సు

ఘంటసాల: ఎల్‌నినో ప్రభావంతో పంటలు వేయని రైతులకు చేయాల్సిన సాయంపై ఆలోచన చేయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఒక్క అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో ఇంకా 15 వేల ఎకరాల్లో నాట్లు పడాల్సి ఉందన్నారు. ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రం ప్రాంగణంలో శుక్రవారం ఎల్‌నినోపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధ ప్రసాద్‌ మాట్లాడుతూ కృష్ణా నది నుంచి చుక్క నీరు రాలేదని పట్టిసీమ ద్వారా వచ్చే గోదావరి నీళ్లే దిక్కు అయ్యాయన్నారు. ప్రకృతిని కాపాడుకుంటే మనం కాపాడబడతామన్నారు. వర్షపాతం తక్కువుగా ఉండటంతో కెనాల్‌ ద్వారా సాగునీరు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో రైతాంగం ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలు, సూచినలు పాటించి ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించాలని కోరారు.

ప్రత్యామ్నాయ పంటపై దృష్టి..

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ మాగాణి రైతులు మినుము ముందుగా వేయొద్దని, ఇప్పటికీ వరి వేయని రైతులు పెసలు వేసుకోవాలని సూచించారు. కృష్ణాడెల్టా వరి మాగాణుల్లో నవంబర్‌ రెండో వారం తర్వాత ఎల్‌బీజీ 752, 832, టీబీటీ104, 129, 145 రకాలు వేసుకోవచ్చని ఇవి 70–80 రోజుల్లో పంట వస్తుందని, చీడపీడలను తట్టుకోవడంతో పాటు మిషన్ల కోతకు అనుకూలమైందన్నారు. డిసెంబర్‌ ఒకటి, రెండు వారాల్లో అయితే పెసలు వేసుకోవాలని, జనవరి ఒకటో వారం నుంచి నెలాఖరులోపు కోతలు వస్తే వారు నువ్వుల పంట వేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌కు చెందిన ఐసీఏఆర్‌ అటారీ జోన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ షేక్‌ ఎన్‌.మీరా మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కొంత ఊరట కలిగించినా రాబోయే పది రోజుల్లో కురిసే వర్షాలు కీలకంగా తీసుకుని త్వరితగతిన రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని శాస్త్రవేత్తలను కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పశు సంవర్థకం, మత్స్య సంపద, విలువ ఆధారిత వస్తు ఉత్పత్తుల తయారీపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు శాస్త్రవేత్తలను, అతిథులను సత్కరించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే సదస్సు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఏ.మణి, విస్తరణ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ జి.రామచంద్రరావు, పరిశోధన విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ వి.సునీత, వ్యవసాయ డీన్స్‌ డాక్టర్‌ సీహెచ్‌.శ్రీనివాసరావు, జగన్నాధరావు, సీఈ డాక్టర్‌ మోహన్‌ రెడ్డి, గుంటూరు లాం ఏడీఆర్‌ డాక్టర్‌ ఎన్‌వీవీఎస్‌ దుర్గా ప్రసాద్‌, ఏఏంసీ ఛైర్మన్‌ తోట కనకదుర్గ, నియోజకవర్గ ప్రత్యేకాధికారి పి.సాయిబాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి కె.జ్యోతిరమణి, ఉద్యానశాఖ జిల్లా అధికారి కె.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement