అవనిగడ్డ: తమకు సమాచారం ఇవ్వకుండా తమ పొలంలో రెవెన్యూ సిబ్బంది సర్వే చేయడాన్ని అడ్డుకున్న మహిళపై రెవెన్యూ సిబ్బంది హేళనగా మాట్లాడి, దౌర్జన్యం చేయడంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన గురువారం జరిగింది. బాధితురాలి నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని దక్షిణ చిరువోలులంకకు చెందిన పరిశె శోభనాద్రికి పంచాయతీ పరిధిలో 40 సెంట్ల పంట భూమి ఉంది. ఈ రహదారి పక్కనే పంచాయతీ రహదారి ఉండగా ఈ రోడ్డుపై శోభనాద్రి కుటుంబ సభ్యులను నడవకుండా కొంత మంది పెత్తందారులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా ఇంతకు ముందు పనిచేసిన తహసీల్దార్ రోడ్డుపై నడవడానికి ఎలాంటి అభ్యంతరం పెట్టొద్దని లిఖితపూర్వక ఆదేశాలిచ్చారు.
అడ్డుకోవడంతో..
గురువారం ఉదయం వీఆర్వో చిన్నారితో పాటు సర్వేయర్, కార్యదర్శి సర్వే చేసేందుకు వెళ్లగా విషయం తెలుసుకున్న శోభనాద్రి భార్య సుజాత ఘటనాస్థలికి వెళ్లి తమ భూమి పక్కనే పంచాయతీ రహదారి ఉందని, ఇక్కడ రైతులు ఎవరూ లేరని, తమకు సమాచారం ఇవ్వకుండా సర్వే ఎలా చేస్తారని రెవెన్యూ సిబ్బందిని ప్రశ్నించింది. తన భర్త వచ్చే వరకూ ఆగాలని చెప్పినప్పటికీ విన కుండా పొలాల్లో కర్రలు పాతడంతో ఆమె అడ్డుకుంది. దీనికి ఆగ్రహించిన వీఆర్వో ఆమెను హేళన చేయడంతో పాటు దౌర్జన్యం చేయగా మనస్తాపం చెందిన సుజాత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. వెంటనే బంధువులు స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. కాగా పదిరోజుల క్రితం పొలం వెళ్తే ఆ కుటుంబం కత్తులతో తనపై దాడికి ప్రయత్నించగా భయంతో పారిపోయి వచ్చానని శోభనాద్రి చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


