సాగుదామా.. ఆగుదామా..! | - | Sakshi
Sakshi News home page

సాగుదామా.. ఆగుదామా..!

Aug 27 2026 3:11 AM | Updated on Aug 27 2026 3:11 AM

● అడకత్తెరలో పోకచెక్కలా కృష్ణా రైతు పరిస్థితి ● జిల్లాలో 90వేల ఎకరాల్లో ఇంకా విత్తు పడని దుస్థితి

గుడ్లవల్లేరు/అవనిగడ్డ: జిల్లాలో వ్యవసాయం చేసే రైతు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. వ్యవసాయం తీవ్ర దుర్భిక్షంగా మారింది. జిల్లాలో 4.12 లక్షల ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేయవలసి ఉంది. కాని అందులో 90వేల ఎకరాల్లో ఆగస్టు నెల పూర్తి కావస్తున్నా... సాగు నీరందక పంటలు వేయకుండా ఆ భూములను రైతులు ఖాళీగా వదిలేశారు. ఆ ఖాళీగా ఉన్న భూముల్లో మొలిచిన గడ్డిని పశువులు మేస్తున్నాయి. ఒకవేళ కొందరు రైతులు ఏదో రకంగా పంటలు వేసినా సాగునీరందక నానా తంటాలు పడుతున్నారు. ఆయిల్‌ ఇంజిన్ల సాయంతో నీటిని తోడుకుంటూ... ఆ పంటలను కాపాడుకునేందుకు చేతి చమురు వదిలించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు ఈ ఏడాది సాగునీరు రాదులే అని నిశ్చయించుకుని తమకు తామే స్వచ్ఛందంగా క్రాప్‌ హాలిడేను ప్రకటించుకున్నారు. సాగు ఆరంభంలో అయితే కొన్ని చోట్ల కడుపు మండిపోయి ఆకుమళ్లను తగులబెట్టుకున్న రైతులు కూడా లేకపోలేదు. ప్రస్తుతం సాగవుతున్న పంటలకు సాగునీరు సవ్యంగా అందకపోవటంతో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు కలుపు సమస్య తలెత్తుతోంది. వచ్చే ఏడాది రబీ చివరి వరకు ఎల్‌నినో సంక్షోభం తప్పదన్న వాదనలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎల్‌నినో తీవ్రతపై కూటమి ప్రభుత్వానికి ముందుగానే అవగాహన ఉన్నా...రైతు సంక్షేమం కోసం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవటం శోచనీయం. ఎల్‌నినో ప్రభావంతో వేసిన పైరు ఎదగకపోగా కొత్తగా అత్యధికంగా కలుపు రైతులకు తలనొప్పిగా మారి అధిక వ్యయం చేయిస్తోంది. వరితో పాటు వేరుశనగ, కంది, పత్తి, మొక్కజొన్న వంటి పైరుల్లో ఏ మాత్రం ఎదుగుదల కనబడటం లేదు. దీంతో ఈసారి పంటల దిగుబడులు కూడా దారుణంగా పడిపోయే ప్రమాదం కనపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement