హనుమాన్‌జంక్షన్ రూరల్: తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో బాపులపాడు మండలం మడిచర్లకు చెందిన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామానికి చెందిన సాయల అనిల్‌కుమార్ (25) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణకు హైదరాబాద్ వెళ్లాడు. ఇటీవల విద్యుత్ ఏఈ నోటిఫికేషన్ విడుదల కావటంతో దర ఖాస్తు చేసిన అనిల్‌కుమార్ గురువారం ఆ పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో సొంతూరు వస్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో అతని రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న అనిల్ కుమార్ తల్లిదండ్రులు అరుణలత, రత్నారావు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. క్షతగాత్రుడిని హుటాహుటిన విజయవాడలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. కాళ్లకు శస్త్రచికిత్స చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


