ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భారత ఎన్నికల సంఘం సీనియర్ డెప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పవన్‌కుమార్ శర్మ బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన పవన్‌కుమార్ శర్మ, విజయవాడ మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్రకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, ఆలయ డీఈఓ కిషోర్‌కుమార్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
ఘంటసాల: సమగ్ర పోషక యాజమాన్యం పద్ధతులు చేపట్టడం ద్వారా రైతులు తక్కువ పెట్టుబడితో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చునని కేవీకే సమన్వయకర్త డాక్టర్ డి.సుధా రాణి సూచించారు. ఘంటసాల గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సమగ్ర పోషక యాజమాన్యంపై శాసీ్త్రయ అవగాహన కల్పించేందుకు 15 రోజుల సర్టిఫికెట్ కోర్సును శాస్త్రవేత్తలు, శిక్షణ సభ్యులతో కలసి డాక్టర్ సుధారాణి బుధవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ.. సెప్టెంబర్ తొమ్మిదో తేదీ వరకు శిక్షణ తరగతులు కొనసాగుతాయని తెలిపారు. నేల పరీక్ష ఆధారంగా ఎరువులు, సేంద్రీయ వనరుల వినియోగం, జీవ ఎరువుల ప్రాధాన్యం, సక్ష్మ పోష కాల నిర్వహణ, పంటల వారీగా సమతుల్య ఎరువుల యాజమాన్యం, సుస్థిర వ్యవసాయ పద్ధతులు తదితర అంశాలపై శిక్షణ శిక్షణ ఇస్తామన్నారు. కేవీకే సస్యపోషణ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. వివిధ పంటల్లో ఎరువుల రకాలు, ముఖ్యమైన పోషక లోపాల లక్షణాలు, నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు జె.యశ్వంత్ కుమార్, డాక్టర్ బి.నవీన్ పాల్గొన్నారు.
చల్లపల్లి: టన్ను చెరకుకు రూ.5 వేలు మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు హను మానుల సురేంద్రనాద్ బెనర్జీ ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. స్థానిక చండ్ర రాజేశ్వర రావు వికస కేంద్రంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. గతంలో దేశంలో 300 లక్షల టన్నుల పంచదార ఉత్పత్తి అయ్యే దని ప్రస్తుతం కేవలం 7.5 లక్షల టన్నులు మాత్రమేనని పేర్కొన్నారు. సరైన గిట్టుబాటు ధర కల్పించకపోవటం వల్లే రైతులు చెరకు సాగుకు ముందుకు రావడంలేదన్నారు. తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మద్దతు ధరకన్నా టన్నుకు రూ.700 చొప్పున ప్రోత్సాహకంగా ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా టన్నుకు రూ.500 చొప్పున ఇచ్చి రైతులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న టన్ను చెరకు మద్దతు ధర రూ.3,380లను రూ.5 వేలకు పెంచాలని డిమాండు చేశారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు వేమూరి రత్నగిరిరావు, కొర్రపాటి ముఖర్జీ, సిద్దాబత్తుల వాసు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు బుధవారం రూ.లక్ష విరాళం సమర్పించారు. భవానీపురానికి చెందిన పి. యశ్వంత్ కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి రూ.1,00,116 విరాళం అందజేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. దాతలకు వేద పండితుల ఆశీర్వచనం అనంతరం డీఈఓ కిషోర్‌కుమార్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.


