అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. వరుసగా రెండు దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. ఆ షాపుల్లోని నగదుతో పాటు సీసీ కెమెరాలు, డీవీఆర్‌లను సైతం ఎత్తుకెళ్లిపోయారు. పోలీసుల కథనం మేరకు.. నున్న గౌడు బజార్‌లో నివాసం ఉంటున్న బాలగోపాల మణికంఠ కుమార్ ఆంధ్రపత్రిక కాలనీ సెకండ్ లైన్‌లో పదేళ్ల నుంచి లక్ష్మీదుర్గ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో టైల్స్ వ్యాపారం చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీన మణి కంఠ కుమారులు రూ.2.80 లక్షలను షాపు కౌంటర్లో బ్యాగులో ఉంచి బయటికి వెళ్లారు. షాపులో పనిచేస్తున్న దుర్గ అనే మహిళ సాయంత్రం 6.30 గంటల సమయంలో షాపు కట్టేసి ఇంటికి వెళ్లిపోగా రాత్రి తొమ్మిది గంటలకు మణికంఠ కుమార్ షాపు దగ్గరికి వెళ్లి షాపు తెరిచి చూడగా బ్యాగ్ కనిపించలేదు.
సితార కేఫ్ హోటల్‌లో చోరీ
ఆంధ్రప్రభ కాలనీ సెకండ్ లైన్‌లో నివసిస్తున్న పొన్నాడ బద్రీనాథ్ నందమూరి నగర్ సెంటర్లో సితార కేఫ్ హోటల్ నడుపుతున్నారు. ఈ నెల 18వ తేదీన అర్ధరాత్రి సమయంలో ఆ హోటల్‌లో గుర్తు తెలి యని వ్యక్తులు గోడ దూకి సీసీ కెమెరాలు, డీవీఆర్‌లతో పాటు క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.50 వేలను దొంగిలించారు. ఈ రెండు ఘటనలపై అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


