విమానాశ్రయం(గన్నవరం): రాష్ట్ర పర్యటన నిమిత్తం ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ ఈ నెల 24వ తేదీన విజయవాడ అంతర్జాతీయ విమానా శ్రయం(గన్నవరం)నకు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎం.నవీన్, ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు గురువారం ముందస్తు భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం టెర్మి నల్ భవనంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉప రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై దిశనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ నవీన్ మాట్లాడుతూ.. ఏలూరు జిల్లాలో జరిగే కార్యక్రమం నిమిత్తం విచ్చేస్తున్న ఉప రాష్ట్రపతికి విమానాశ్రయంలో స్వాగతం, తిరుగు ప్రయాణ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లకు గుడివాడ ఆర్డీఓ ఓవరాల్ ఇన్‌చార్జిగా నియమించామని తెలిపారు. అన్ని శాఖల అధికారులు ఆర్డీఓతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎయిర్‌పోర్ట్‌లో వీఐపీ రిసెప్షన్, గ్రీన్ రూములు, పార్కింగ్, అల్పాహారం, వైద్య సదుపాయలు తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. వైద్య పరంగా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేలా డీఎంహెచ్‌ఓ, డీసీహెచ్‌ఎస్, జీజీహెచ్, ఏపీవీవీఏ అధికారులు, వైద్య పరికరాలను అందుబాటులో ఉంచా లని ఆదేశించారు. ఎస్సీ విద్యాసాగర్‌నాయుడు మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ పర్యటన సందర్భంగా విమానాశ్రయం నుంచి ముసునూరు వరకు పటిష్టవంతమైన భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విమానాశ్రయంలోని కొత్త టెర్మినల్‌తో పాటు అన్ని కీలక ప్రాంతాలను భద్రత పరిధిలోకి తీసుకోవాలని సూచించారు. ప్రయాణ మార్గంలో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, వీడియో బృందాలను అవసరమైన చోట్ల ఏర్పాటు చేయాలని తెలిపారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఎయిర్‌పోర్టులోకి అనుమతించాలని స్పష్టంచేశారు. కాన్వాయ్ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఇన్‌చార్జ్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎ.కె.జైశ్వాల్, ముఖ్య భద్రతాధికారి కె.ధర్మేంద్ర, డెప్యూటీ కలెక్టర్ ఎస్.పోతురాజు, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం, తహసీల్దారు కె.వి. శివయ్య తదితరులు పాల్గొన్నారు.


