రూ.5248 కోట్ల డీపీఆర్‌ను ఆమోదించి వర్క్ ఆర్డర్ ఇవ్వాలి టాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిమాండ్
కృష్ణలంక(విజయవాడతూర్పు): బుడమేరు అభి వృద్ధి పనుల కోసం రు.5248.28 కోట్ల అంచనా లతో రాష్ట్ర జలవనరుల శాఖ తయారు చేసిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను తక్షణమే ఆమోదించి వర్క్ ఆర్డర్ ఇవ్వాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి యు.వి.ఆంజనేయులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర జనవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు, జనవలరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి స్పీడ్ పోస్ట్ ద్వారా మెమొరాండాలు పంపినట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీకి బుడమేరుకు వరద వచ్చి రెండేళ్లు అవుతున్నప్పటికీ నగర ప్రజల్లో ఆ భయం ఇంకా పోలేదన్నారు. గట్టిగా వర్షం పడితే మరల వరద వస్తుందేమోనని నేటికీ భయపడుతున్నారని పేర్కొన్నారు. రెండేళ్లలో బుడ మేరు డైవర్షన్ చానల్ గండ్లు పూడ్చటం మినహా విజయవాడకు ఎగువ భాగాన తీసుకున్న చర్యలేమీ లేవన్నారు. 2024లో దాదాపు 40 వేల క్యుసెక్కులకు పైగా వరదనీరు వచ్చిందని, బుడమేరు డైవర్షన్ చానల్ క్యారీయింగ్ కెపాసిటీ 15 వేల క్యుసెక్కులు మాత్రమేనని వివరించారు. మళ్లీ అలాంటి వరద వస్తే బుడమేరు డైవర్షన్ చానల్ సామర్థ్యం చాలదన్నారు. డీపీఆర్ రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని, అది ఆమోదం పొంది పనులు జరిగితే మొత్తం బుడమేరు వ్యవస్థను పైనుంచి కింది వరకు అభివృద్ధి చేయటంతో పాటు, కొత్త వరద కాలువ నిర్మాణం జరుగుతుందని వివరించారు. ఈ పనులు పూర్తయితే విజయవాడకు వరద ముప్పు శాశ్వతంగా తప్పుతుందన్నారు. టాక్స్‌పేయర్స్ అసోసి యేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.సాంబిరెడ్డి, కోశాధికారి వి.ఎస్.రామరాజు, పౌర సంక్షేమ సంఘం కార్య దర్శి ఎ.పున్నారావు, బీఎస్‌ఎన్‌ఎల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు.


